Mostly Weddings Today : శ్రావణ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు. ఈనెల 8 నుంచి పెళ్లిళ్లు ప్రారంభమవగా అనేక జంటలు ఒక్కటయ్యాయి. ఈనెల 28తో శుభ ముహూర్తాలు ముగియనుండగా వివాహాల జోరు పెరిగింది. ఉదయం రకరకాల పూలతో కళకళలాడుతున్న పెళ్లి మండపాలు రాత్రిళ్లు విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో వేదికలు కళకళలాడుతున్నాయి.
Wedding Rush in AP 2024 : గ్రామాల్లోనూ ఎక్కడ చూసినా వివాహ సంబరాలు కనిపిస్తున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యుల ఆనంద హేళి చేసుకోగా స్నేహితులు, సన్నిహితుల సంబరాలతో ఊరు వాడా డిజేలు హోరెత్తుతున్నాయి. ఆదివారం మంచి ముహూర్తం కావడంతో వేలాది జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. ఇవాళ అంతకుమించి లగ్గాలు జరగనున్నాయి. పట్టణాలు, నగరాల్లో మండపాలు దొరకడం లేదు. గ్రామాల్లోనూ వివాహాల సందడి కనిపిస్తోంది.
ఒకే రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండడంతో ఎటు వైపు వెళ్లాలో బంధవులు తేల్చుకోలేకపోతున్న పరిస్థితులున్నాయి. ఒక్కో పురోహితుడు కనీసం ఐదు పెళ్లిళ్లు చేసే పరిస్ధితి వచ్చిందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల ఫంక్షన్ హాళ్లు దొరక్క పెళ్లిళ్లు వేరే రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. ఈనెల 22, 24 కూడా మంచి ముహూర్తాలున్నాయి. వీటికి నాలుగైదు నెలలముందే మండపాల బుకింగ్‌లు జరిగిపోయాయి. పెళ్లి ఈవెంట్లకూ డిమాండ్ పెరిగింది. డెకరేషన్ చేసేవారు, పూల సరఫరాదారులు, వంటవాళ్లు, భాజాభజంత్రీలూ అంతా బిజీ అయిపోయారు.
"ఈరోజు చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడుతున్నాయి. 22, 24, 28 కూడా మంచి మూహుర్తాలున్నాయి. ఎటువైపు హాజరు కావాలో అర్థం కావడం లేదు. మా అన్నగారి అబ్బాయి పెళ్లి ఈ నెల 24న జరగనుంది. అందుకోసం నాలుగు నెలల ముందే ఫంక్షన్ హాల్ బుక్ చేశాం. డెకరేషన్ చేసేవారు, పూల సరఫరాదారులు , వంటవాళ్లు, భాజాభజంత్రీల వారిని ముందస్తుగానే బుక్ చేసుకున్నాం." - కోటేశ్వరరెడ్డి,నున్న, విజయవాడ
"శ్రావణం తర్వాత వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాం. సెప్టెంబర్ నెలలో శుభకార్యక్రమాలు చేస్తాం. ఆ నెలలో వివాహాలు, గృహప్రవేశాలకు ముహుర్తాలు లేవు. కాబట్టి శ్రావణ మాసంలో 19,20, 22, 24, 28 తేదీలు వివాహాలకు చాలా బాగున్నాయి. అందుకే ఈ రోజులు పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి." - ఆచార్య గోపీనాథ్, ఆగమ పండితులు
ప్రయాణ ప్రాంగణాలు కిటకిట : ఈ మాసంలో ముహూర్తం కుదరకపోతే పెళ్లికి మరో మూడు నెలలు ఆగాల్సిందేనని పండితులు చెప్తున్నారు. దీంతో వివాహాల తర్వాత జరిగే శుభ కార్యాలకూ కలసి వస్తుందని అంటున్నారు. ఈ నెల 22, 24 తేదీల్లోనూ జాతకాల ప్రకారం కొందరికి పెళ్లి ముహూర్తాలు కుదరడంతో ఆ రోజూల్లోనూ పెళ్లి భాజాలు బాగానే మోగనున్నాయని చెబుతున్నారు. మరోవైపు వివాహాలకు వెళ్లే బంధుమిత్రులతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి! పెళ్లిళ్ల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రైవేట్ వాహనాలకూ లాభాల పంట పండుతోంది.
పెళ్లిళ్లకు వేళాయే - ఈ నెలలో శుభ ముహూర్తాలివే - Wedding Season Started