Timber Merchant Enslaved Six Families: మూడంటే మూడు వేల రూపాయలు. కనీసం గంజి తాగడానికి కూడా సరిపోని ఈ డబ్బులతోనే ఓ కుటుంబం నెలంతా గడపడం సాధ్యమా. తిండి సంగతి సరే. మధ్యలో రోగమొస్తే పరిస్థితి ఏంటి ? సర్కారీ దవాఖానా అందుబాటులో లేకపోతే కనీసం మందుబిళ్లలు కొనుక్కోవడమైనా కుదురుతుందా? గూడులేక, గుడ్డలేక, తిండిలేక, రోగాలకు తాళలేక దయనీయ జీవితం గడిపిన యానాది కుటుంబాలకు. మూడేళ్ల తర్వాత వెట్టిచాకిరీ నుంచి విముక్తి దొరికింది.
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్యాపారి చేతిలో మూడేళ్లుగా బందీగా మారాయి ఆరు యానాది కుటుంబాలు. జీవనోపాధి కోసం తన వద్దకు వచ్చిన యానాది కుటుంబాలతో కలప వ్యాపారి మస్తాన్ వలీ వెట్టిచాకిరీ చేయించుకున్నాడు. చిన్నాపెద్దా కలిసి కుటుంబమంతా పనిచేస్తే నెలకు 3వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. పొలాల్లో చిన్నపాటి పాకలు వేయించి జనావాసాల్లోకి రాకుండా, బంధువర్గంతో కలవకుండా అడ్డుకున్నాడు.
దాదాపు 25 మందిని బానిసలుగా మార్చుకుని చెట్లు కొట్టడం, ట్రాక్టర్లు, లారీలలో లోడింగ్ చేయడం వంటి పనులు చేయించాడు. ఆరోగ్యం బాగలేపోయినా వదలకుండా పని చేయాల్సిందే అంటూ వాళ్ల జీవితాలతో ఆడుకున్నాడు. అనారోగ్యం బారిన పడిన నాలుగేళ్ల పాప సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. అయినా యజమాని మనసు మారలేదు. అంతేకాకుండా వెంటనే పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టి పనిలోకి రావాలని అజమాయిషీ చేశాడు.
"మూడేళ్లుగా కలప వ్యాపారి మాతో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కనీసం గంజి తాగేందుకు కూడా సరిపోని జీతం ఇచ్చేవారు. దీంతో సరైన తిండిలేక రోగాల బారిన పడినా కూడా మాకు చికిత్స చేయించేవాడు కాదు. ఇదే పరిస్థితిలో సరైన సమయంలో చికిత్స అందక నాలుగేళ్ల పాప మృతిచెందింది. ఇక్కడే ఉంటే మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందనే భయంతో పోలీసులను ఆశ్రయించాము." - బాధిత యానాది కుటుంబాలు
మూడేళ్లుగా దుర్భర జీవితం గడిపిన ఆరు బాధిత కుటుంబాలు యానాది సంఘాల సాయంతో పోలీసులను ఆశ్రయించాయి. ఎస్పీ ఆదేశాలతో మస్తాన్ వలీని విచారించిన వినుకొండ గ్రామీణ సీఐ ఆ కుటుంబాలకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు. సంచార జీవనం గడుపుతున్న ఈ కుటుంబాలకు ప్రభుత్వం ఓ దారి చూపించాలని యానాది సంఘాల నేతలు కోరుతున్నారు. వీళ్లలాగే మరెన్నో కుటుంబాలు గూడు, గుడ్డ లేకుండా దయనీయ స్థితిలో ఉన్నాయని, వాళ్లందర్నీ ఆదుకోవాలని విన్నవిస్తున్నారు.
Public fire on YSRCP leaders: అధికార పార్టీ నేతల అడ్డదారులు.. అవస్థల్లో అమాయక ప్రజలు