Gold Jewellery Robbery In SBI Bank Warangal District : ఎస్‌బీఐ శాఖలో దుండగులు సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు వద్ద కాపలాదారుడు లేకపోవడాన్ని గమనించిన దుండగులు ముందుగా అలారం తీగలను కత్తిరించారు. అనంతరం కిటికీని ధ్వంసం చేసి, దానికున్న ఇనుప గ్రిల్‌ను తొలగించి బ్యాంకు లోపలికి వెళ్లారు. వెంటనే సాక్ష్యాలు దొరక్కూడదనే ఉద్దేశంతో సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. తరువాత రూ.14.94 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి జరిగింది.
గ్యాస్ కట్టర్‌తో లాకర్‌ను కత్తిరించి : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం " కిటికీ తొలగించి బ్యాంకు లోపలికి వెళ్లిన దుండగులకు మూడు సేఫ్టీ లాకర్లు కనిపించాయి. దీంతో వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో ఒక లాకర్‌ను కత్తిరించి తెరిచారు. అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం ఆభరణాల ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో 497 ప్యాకెట్లలోని దాదాపు రూ.14.94 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించాం. దొంగలు చివరగా వెళ్లే ముందు సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను సైతం దొంగిలించారు. లాకర్ తెరిచేందుకు వినియోగించిన గ్యాస్ కట్టర్ అక్కడే వదిలివెళ్లారు. మంగళవారం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు " అని తెలిపారు.
బ్యాంకులో డబ్బు డ్రా చేస్తున్నారా? - మీ వెంటే 'కర్ణాటక గ్యాంగ్' - లబోదిబోమంటున్న ఖాతాదారులు
బ్యాంకు వద్ద ఆందోళన : వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రావణ్‌కుమార్, రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చోరీ గురించి తెలుసుకొని పలువురు ఖాతాదారులు ఆందోళనతో బ్యాంకు వద్దకు రాగా నష్టం జరగకుండా చూస్తామని బ్యాంకు అధికారులు నచ్చజెప్పి పంపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, అపహరణకు గురైన సొత్తు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. మంగళవారం రాత్రి వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ బ్యాంకుకు చేరుకొని పరిశీలించారు. రెండేళ్ల క్రితం కూడా ఈ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నం చేశారు. తరువాత ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించగా అతను ఏడాది క్రితం మానేశాడు. మళ్లీ ఎవరినీ ఏర్పాటు చేయలేదు.
"దొంగ తెలివి" ఇంట్లో సెల్‌ఫోన్ చోరీ - తిరిగి దుకాణంలో వాళ్లకే బేరం పెట్టిన ఘనుడు
బాపట్ల జిల్లాలో భారీ చోరీ - లారీని అడ్డగించి వ్యాపారి నుంచి రూ.39 లక్షలు అపహరణ