Police Seize Ganja in Abdullapurmet : ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు, చిక్కితే జైలు ఊచలు తప్పవని స్మగ్లర్లు. సినీ ఫక్కీలో 30 కిలోమీటర్ల వరకు సాగిన పోలీస్ వేటలో, చివరకు గంజాయి ముఠా చిక్కింది. ఈ ఘటన నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటుచేసుకుంది. ఏపీ వైపు నుంచి గంజాయితో ఓ వాహనం వస్తున్నట్టు నల్గొండ పోలీసులకు సమాచారం అందింది. ముఠా కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్‌ప్లాజా వద్ద కాపు కాశారు.
కారులో టోల్‌ప్లాజా వరకు వచ్చిన నలుగురు స్మగ్లర్లు, పోలీసుల కంటే ముందే అప్రమత్తమై కారును హైదరాబాద్ వైపు మళ్లించారు. అబ్దుల్లాపూర్‌మెట్ వరకు చేరిన ముఠా సభ్యులు, సమీపంలోని గండి మైసమ్మ ఆలయం వద్ద ఒక్కసారిగా కుడివైపున ఉన్న ఓ కాలనీలోకి మలుపు తిరిగారు. అయితే ఆ కాలనీలోకి ప్రవేశించిన ముఠా, ముందుకు వెళ్లేందుకు రోడ్డు లేకపోవటంతో వెనుదిరిగారు. వారిని వెంబడిస్తూ వచ్చిన పోలీసులు పట్టుకునేందుకు వెళ్లడంతో, నిందితులు వారిని కారుతో ఢీకొట్టారు.
ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అయితే నిందితులు తప్పించుకోకుండా ఓ యువకుడు తన కారును ముఠా ప్రయాణిస్తున్న కారు వెనుక అడ్డంగా నిలిపాడు. అక్కడికి చేరుకున్న మిగిలిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు కూడా పోలీసులకు సహకరించారు. గాయపడిన కానిస్టేబుల్‌కు ఓ మహిళ తాగు నీరందించి, చేతికి కట్టుకట్టి పోలీసు వాహనం వరకు తీసుకెళ్లారు.