Constable Traps Girl and Raped : పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలు మాయమాటలు చెబుతూ నాలుగేళ్లుగా మోసం చేస్తూ వచ్చాడు. తీరా పెళ్లి చేసుకోవాలని బాలిక ప్రశ్నించడంతో ముఖం చాటేశాడు. తన దగ్గర ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, వాటిని నెట్లో పెడతానంటూ బెదిరిస్తూ తన శారీరక వాంఛను తీర్చుకున్నాడు. ఇదంతా చేసింది అల్లరి చిల్లర పోకిరీ కాదు. ప్రజలను రక్షించే ఓ బాధ్యత కలిగిన కానిస్టేబుల్. జరిగన విషయమంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులను ఆశ్రయించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే రాజేంద్రనగర్ ఏసీపీ టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, 2020 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ అనే కానిస్టేబుల్ మొదటగా పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించినట్లు తెలిపాడు. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి తమ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
పెళ్లి చేసుకోవాలని సదరు బాలిక గట్టిగా ప్రశ్నించడంతో, ముఖం చాటేసి తనకు సంవత్సరం క్రితమే పెళ్లి జరిగిందని తెలిపాడన్నారు. తన వద్ద ఇరువురు ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, వాటిని నెట్లో విడుదల చేస్తానని గత కొన్ని రోజులుగా సదరు బాలికను బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సదరు కాానిస్టేబుల్పై డిపార్ట్మెంటల్ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి తమ కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2020 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ అనే కానిస్టేబుల్ ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తన వద్ద ఇరువురు ఏకాంతంగా ఉన్న వీడియోలు ఉన్నాయని, బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశాం". - శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ