Voters Enrollement in Telangana : రాష్ట్రంలో సాధారణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. 2025 జనవరి ఒకటో తేదీ ప్రామాణికంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చేపట్టింది. 2025 జనవరి ఒకటో తేదీ వరకు 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వీరితో పాటు 18 ఏళ్లు నిండి ఓటుహక్కు లేని వారు, మార్పులు-చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి చిరునామా మార్పు, సవరణలు, కొత్త ఓటరు గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు తదితరాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే, జాబితాలో పొరపాట్ల సవరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు తదితర ప్రక్రియలు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి. వాటన్నింటిని పరిశీలించి, సవరణలు చేసి ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. ఆ రోజు నుంచి నెల రోజుల పాటు నవంబర్ 28వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. ఈ సమయంలో రెండు రోజులు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ నెలలో రెండో శనివారమైన తొమ్మిది, ఆ మరుసటి రోజు ఆదివారం పదో తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు.
బీఎల్ఓల సహాయంతో పోలింగ్ కేంద్రాల వద్దే జాబితాలో ఉన్న పేర్లు, వివరాలు సరిచూసుకోవచ్చు. మార్పులు-చేర్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్, యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. వచ్చిన అభ్యంతరాలు, వినతులను డిసెంబర్ 24వ తేదీ వరకు పరిష్కరించి తుది జాబితా తయారు చేసి 2025 జనవరి ఆరో తేదీన ప్రకటిస్తారు.
శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల కోసం ఓటరు జాబితా : శానసమండలి ద్వైవార్షిక ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇద్దరు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీ కాలం 2025 మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీకి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు నవంబర్ ఆరో తేదీ వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటిని పరిశీలించి నవంబర్ 23వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులకు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు గడువు ఉంది. వాటిని పరిష్కరించి డిసెంబర్ 30వ తేదీన మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాలను ప్రకటిస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీలో డినోవా విధానం : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీలో కేంద్ర ఎన్నికల సంఘం డినోవా విధానాన్ని అనుసరిస్తోంది. గత జాబితాలతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికకూ కొత్త జాబితాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా గతంలో ఓటు హక్కు ఉన్న వారు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గంలోని అర్హులు అందరూ విధిగా ఓటుహక్కు కోసం తప్పక దరఖాస్తు చేసుకోవాల్సిందే.