Kumki Elephant : పంటలు, తోటల విధ్వంసంతో పాటు సామాన్య ప్రజలు, రైతులపై ఏనుగుల దాడులు పెరిగిపోతున్నాయి. చిత్తూరు, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల గురించి తరచూ వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గజరాజుల దాడుల నుంచి విముక్తి కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. కుంకీ ఏనుగులను రంగంలోకి దించడం ద్వారా దాడులకు చెక్ పెట్టొచ్చని భావిస్తోంది. అతి త్వరలోనే కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి. అసలు కుంకీ ఏనుగులు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుమ్కి, కూంకి లేదా కుంకి అంటే శిక్షణ పొందిన ఏనుగు అని అర్థం. అడవి ఏనుగులను ట్రాప్ చేయడం, దారి మళ్లించడంలో కుంకి ఏనుగులు సహకరిస్తాయి. దీంతో పాటు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి, వైద్య చికిత్స అందించడానికి ఇవి ఉపయోగ పడుతాయి.
అడవి నుంచి తప్పిపోయి లేదా ఆహారం కోసం పంటలపైకి దాడులకు వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నంలో కుంకీ ఏనుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏనుగులను తరమికొట్టడంలో వాటితో పోరాడడంలో కుంకీలు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాయి. ఇలాంటి శిక్షణ పొందిన ఏనుగులు ఇప్పటికే ఎన్నో అడవి ఏనుగులను అడ్డుకున్నాయి.
మదపుటేనుగులే కుంకీలు..
సహజంగా ఆడ ఏనుగులు మందలుగా, మగ ఏనుగులు ఒంటరిగా సంచరిస్తుంటాయి. ఆడ ఏనుగులు ఎప్పుడూ తమ పిల్లలతోపాటూ ఒక పెద్ద మందలోనే కొనసాగుతుంటాయి. అందుకే ఒంటరిగి తిరిగే మగ ఏనుగులను బంధించి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి కుంకీలుగా తీర్చిదిద్దుతారు. పలుమార్లు పంటలు ధ్వంసం చేయడంతో పాటు మనుషులకు హాని తలపెట్టిన మగ ఏనుగులనే ప్రత్యేకంగా ఎంచుకుంటారు.
ఏనుగుల మంద పొలాలపై దాడి చేసినపుడు అటవీ అధికారులు కుంకీ ఏనుగులను తీసుకెళ్తారు. దీంతో వాటి వల్ల మందలోని పిల్లలకు నష్టం జరగకుండా ఏనుగుల మంద పారిపోతుంది. అయితే ఒంటరిగా దాడి చేసే మగ ఏనుగులు ఒక్కోసారి కుంకీలపై పోరాటానికి దిగుతాయి. రెండింటి మధ్య జరిగే పోరాటం గంటల పాటు జరుగుతుంది. ఈ మేరకు సుశిక్షితులైన మావాటీలు కుంకీలను ముందుగానే సిద్ధం చేస్తుంటారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం- దాడిలో రైతు మృతి - ELEPHANT Attack
Elephant Attack on Bus: మన్యం జిల్లాలో బస్సుపై ఏనుగు దాడి.. భయాందోళనతో ప్రయాణికుల పరుగులు