TGNAB Police Trying To Stop Drug supply : మాదకద్రవ్యాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే, నేరగాళ్లను పట్టుకోవడంలో అన్ని కేంద్ర విభాగాలు, ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకునే క్రమంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సవాళ్లు ఎదుర్కొంటోంది. ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగే సమయంలో వారి నుంచి సరైన స్పందన కరవవుతోంది.
తెలంగాణలో ప్రతి నెలా సగటున 5 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అధికారులు పట్టుకుంటున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ. 16 లక్షల విలువైన సరకు బయటపడుతోంది. గంజాయి వాడకం గ్రామగ్రామానికీ విస్తరిస్తే, కొకైన్ వంటి ఖరీదైన ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. ఈ దందాను అంతర్రాష్ట్ర నేరగాళ్లు, విదేశీ ముఠాల సభ్యులు కలిసిగట్టుగా నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌ను తెలంగాణకు రవాణా చేస్తున్నారు. మత్తు పదార్థాల కట్టడి కోసమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసింది.
గత ఏడాది మే 31వ తేదీ నుంచి టీజీన్యాబ్ తన పనిని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు టీ న్యాబ్ అధికారులు రూ.70 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. 790 కేసులు నమోదు చేశారు. మొత్తం 1556 మందిని అరెస్టు చేశారు. గత సంవత్సరం ముందు పట్టుబడిన నిందితుల సంఖ్య కంటే ఇది రెట్టింపు సంఖ్య. ఎన్ని ముఠాలను పట్టుకున్నా, సరఫరా, వినియోగం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికీ కొత్త ముఠాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ వినియోగం జరుగుతూ ఉన్నయనే ఆరోపణలు వినిపిస్తునే ఉన్నాయి.
అంతర్రాష్ట్ర నేరగాళ్లే అసలు సమస్య : డ్రగ్స్ కట్టడిలో అంతరాష్ట్ర నేరగాళ్లతోనే అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో తిష్ఠ వేసిన వీరి సమాచారం సేకరించగలుగుతున్నా, ఆయా రాష్ట్రాల్లో పోలీసుల సహాయ నిరాకరణతో నేరగాళ్లను కట్టడి చేయలేకపోతున్నారు. రూ. కోట్లతో ముడిపడిన వ్యాపారం కావడం వల్ల స్మగ్లర్లు పలు ప్రాంతాల్లో పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
కరడు గట్టిన డ్రగ్ పెడ్లర్ ఎడ్విన్‌న్యూన్స్ గోవా కేంద్రంగా కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తున్నాడు. మన పోలీసులు ఎన్నిసార్లు వెళ్లినా దొరికేవాడు కాదు. దాంతో అనుమానం వచ్చి ఆరా తీయగా, తెలంగాణ పోలీసులు ఎడ్విన్ కోసం వెళ్లిన ప్రతిసారీ ఆ సమాచారాన్ని గోవా పోలీసులు అతడికి చేరవేసేవారని వెల్లడైంది. చివరకు దాదాపు పదిమందితో కూడిన బృందం అతికష్టం మీద ఎడ్విన్‌ను పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.
అంతర్రాష్ట్ర దర్యాప్తులో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ అధికారులు ఉన్నతస్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను సైతం ఇందులో భాగస్వాములుగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో మండలాల వారీగా గంజాయి సాగు, సరఫరా వివరాలు సేకరించాలని ఓ నిర్ణయించారు. ఈ దిశగా అబ్కారీ, రెవెన్యూ అధికారులతో త్వరలోనే సమన్వయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
విదేశాలు, ఇతర రాష్ట్రాలతో లింకులు : తెలంగాణలో వినియోగించే మత్తు పదార్థాల్లో 90 శాతం వరకు ఇతర రాష్ట్రాలతో పాటుగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంజాయి ఎక్కువగా సాగయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత దీన్ని చాలావరకు నివారించగలిగారు. ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో స్థానికులు గంజాయి పండిస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన దళారులు రవాణా చేస్తున్నారు.
గోవా, బెంగళూరు, ముంబయి లాంటి ప్రాంతాల్లో తిష్ఠ వేసిన ఆఫ్రికా దేశీయులు హెరాయిన్, కొకైన్లను రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో తయారవుతున్న సరకునూ హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఇతర దేశాల నుంచి సరఫరా అవుతున్న మత్తుమందులను అంతర్జాతీయ నిఘా సమాచారం ఉన్నప్పుడే, కస్టమ్స్, కేంద్ర నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాలు పట్టుకోగలుగుతున్నాయి.