TG Vehicle Registration in Telangana 2024 : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ఇకపై టీజీ పేరిట చేయాలని మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖకు ఇప్పటికే సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతేడాది నవంబర్ 30 నాటికి రవాణా శాఖలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 1,60,81,666 ఉన్నాయి. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని టీజీగానే సంబోధించే వాళ్లమని వివిధ మోటారు వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. తమ వాహనాలకు టీజీ అని రాసుకునే వాళ్లం అని అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నారు.
TG Registration For New Vehicles : ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ క్యాబ్ అసోసియేషన్ నాయకులు, ఆటో యూనియన్ అసోసియేషన్ నేతలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వాహనాలకు టీఎస్ స్థానంలో టీజీ పేరితో రిజిస్ట్రేషన్ (Vehicle Registration) చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మోటారు వాహనాల యూనియన్ నేతలు తెలిపారు. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఇబ్బందేమి లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి
పాత వాహనాలకు కూడా టీఎస్‌ను తొలగించి టీజీ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆర్థికంగా భారం పడుతుందని మోటారు వాహనాల యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లు ఉండే అవకాశం ఉంటుందని అదొక సమస్యగా మారుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ద్విచక్ర వాహనదారులకు, ఆటోవాలాలకు, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భారం పడుతుందని మోటార్ వాహన యూనియన్ నేతలు వెల్లడించారు.
నూతన వాహనాలకు టీజీ రిజిస్ట్రేషన్లు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పాత వాహనాలను టీజీ పేరు మీద మార్చాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకవేళ అందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించాలి. ఇప్పటికే ట్యాక్స్‌లు పెరిగాయి. గత ప్రభుత్వంలో ట్యాక్స్‌లు పెంచారు. వాటిని కట్టలేక పోతున్నాం. ఈ ప్రభుత్వమైనా వాటినా తగ్గించాలని కోరుతున్నాం. - గోపాల్‌రెడ్డి, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ నేత
TS to TG on Vehicle Registration : ఇప్పటికే ఏపీ పేరిట రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్నాయి. చాలా మంది ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన వాహనాలను ఏపీ పేరుతోనే తిప్పుతున్నారు. ఆ తర్వాత టీఎస్ పేరిట రిజిస్ట్రేషన్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో టీజీ పేరిట రిజిస్ట్రేషన్ కానున్నాయి. రవాణా శాఖకు అధికారిక ఉత్తర్వులు జారీ అయితే వారం రోజుల్లో టీజీ పేరిట వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వాహనాల పెండింగ్ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు - ఎప్పటివరకంటే
పాత వాహనాలు దాదాపుగా టీఎస్ పేరు మీదనే కొనసాగుతాయని ఈ విషయంలో మోటారు వాహన యూనియన్ నేతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ (Telangana Transport Department) అధికారులు భరోసా ఇస్తున్నారు. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ కాబోయే వాహనాలను మాత్రమే టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. వాహనాలను టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో వాహనదారులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని మోటార్ వాహనాల యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
మీకు గూడ్స్ వెహికిల్ ఉందా? అయితే వెంటనే ట్యాక్స్ కట్టేయండి - పట్టుబడ్డారో పెనాల్టీ మోతే!
8 నుంచి బడ్జెట్ సమావేశాలు - అసెంబ్లీ వేదికగా మరో 2 గ్యారంటీలు ప్రకటించనున్న సీఎం!