Better Medical Services At Nizamabad Govt Hospital : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అత్యుత్తమ సేవలతో కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా నిలుస్తోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ చొరవతో సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అరుదైన అపరేషన్లు నిర్వహించడంతో పాటు కష్టతరమైన సేవలు అందిస్తూ ఆసుపత్రి పలువురి ప్రశంసలు అందుకుంది.
అధిక వ్యయానికి అయ్యే వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో సూపర్ స్పెషాలిటీని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే పలు విభాగాల్లో సేవలు ప్రారంభించగా మరిన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Super Specialty Services : ఆంకాలజీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. మూడు నెలలుగా రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే న్యూరాలజీని కూడా నిజామాబాద్‌లోనూ ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికీ చికిత్స అందిస్తున్నారు.
నేడు కార్పొరేట్ ఆస్పతుల్లో రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చయ్యే సేవలను ఉచితంగా అందించి ఎందరికో ఆర్థిక భారం లేకుండా చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి సూపర్ స్పషాలిటీ హోదా లేకున్నా ప్రత్యేక చొరవ తీసుకుని పేదల కోసం ఈ సేవలు తీసుకొస్తున్నామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
గుండె జబ్బులకూ మెరుగైన సేవలందించే దిశగా : ప్రైవేటు ఆసుపత్రిలో గుండెకు స్టంట్ వేయాలంటే రూ.2లక్షల నుంచి రూ.3 లక్షలకు పైనే ఖర్చవుతుంది. ఇప్పటికే స్టంట్లు, ఇతర శస్త్రచికిత్స పరికరాల టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా త్వరలో సేవలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే హృద్రోగం బారిన పడినవారికి సుమారు 30 వేల రూపాయల విలువైన సూది మందు ఇస్తున్నారు.
త్వరలో నెఫ్రాలజీ సేవలు కూడా అందుబాటులోకి : త్వరలో నెఫ్రాలజీ వైద్య సేవలు సైతం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కొనసాగుతున్న విభాగాల్లో ఓపి సమయాన్ని పొడిగించాలని రోగులు కోరుతున్నారు. పరీక్షలు చేసుకున్న అనంతరం వైద్యులకు రిపోర్టులు ఇవ్వాలనుకునే లోపే వారు వెళ్లిపోతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు వాపోతుున్నారు. సూపర్ స్పెషాలిటీ హోదా లేకున్నా ఆ సేవలు అందించడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Government Maternity Hospital: ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రినే ఎంచుకుంటున్నారు ఈ గ్రామ ప్రజలు...