Tension At Manchu Mohanbabu House: మంచు కుటుంబంలో వివాదం తీవ్రస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటికి కుమారుడు మంచు మనోజ్ రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి అదనపు డీజీపీని కలిసిన అనంతరం మంచు మనోజ్ దంపతులు మోహన్‌బాబు ఇంటికి వచ్చారు. ఈ సమయంలో మంచు మనోజ్‌ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేటు తెరవాలంటూ సెక్యూరిటీ సిబ్బందిపై మనోజ్ మండిపడ్డారు. తమ పాప లోపల ఉందని, గేటు తీయాలని ఆగ్రహించారు. గేటు తీయకపోవడంతో నెట్టుకొని లోపలికి వెళ్లారు.
మీడియా ప్రతినిధులపై చేయిచేసుకున్న మోహన్‌బాబు: మోహన్‌బాబు నివాసంలో మంచు మనోజ్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. చిరిగిన చొక్కాతో మంచు మనోజ్ బయటకు వచ్చారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు చేయి చేసుకున్నారు.
ఇద్దరి తుపాకులనూ స్వాధీనం చేసుకున్న పోలీసులు: ఘటన అనంతరం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్‌బాబు చేరారు. మంచు విష్ణుతో కలిసి కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లిన మోహన్‌బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్‌బాబు, మంచు మనోజ్ లైసెన్స్‌డ్ తుపాకులను ఫిల్మ్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంచు మనోజ్, విష్ణుకి నోటీసులు: అదే విధంగా మంచు మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. బుధవారం వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఇద్దరినీ ఆదేశించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. జల్‌పల్లిలోని జరిగిన ఘటనపై సీపీ విచారణ చేయనున్నారు. జల్‌పల్లిలో జరిగిన దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచకొండ సీపీ, ఇప్పటికే మోహన్‌బాబు, మనోజ్ తుపాకులను సీజ్ చేశారు.
మీడియా ప్రతినిధుల ఆందోళన: దీనికి తోడు మీడియా ప్రతినిధులపై దాడికి నిరసనగా మోహన్‌బాబు ఇంటివద్ద మీడియా ప్రతినిధుల ఆందోళన చేపట్టారు. మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలంటూ మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే, డబ్ల్యూజేఐ, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మోహన్‌బాబు దాడిని ఖండించాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోలీసులతో మౌనిక వాగ్వాదం వీడియో వైరల్: మరోవైపు పోలీసులతో ఫోన్‌లో మౌనిక వాగ్వాదం వీడియో వైరల్ అవుతోంది. తన పిల్లలు, కుటుంబసభ్యుల జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించారు. మంచు మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారని, తన బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారని ఆగ్రహించారు. బౌన్సర్లను ఎలా బయటకు పంపుతారని పోలీసులతో మౌనిక వాగ్వాదానికి దిగారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, మంచు మనోజ్‌కు గాయాలయ్యాయని అన్నారు.
ఆస్తి, డబ్బు కోసం కాదు - ఇది ఆత్మగౌరవ పోరాటం : మంచు మనోజ్
మంచు కుటుంబంలో రచ్చ రచ్చ - అర్ధరాత్రి వారిని ట్యాగ్ చేస్తూ మనోజ్ ట్వీట్