Tennikoit Champions In Vijayanajaram District : మౌనికది విజయనగరం జిల్లాలోని కొండలక్ష్మీపురం. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. వ్యవసాయ కుటుంబం. తండ్రి సత్తిబాబు, తల్లి పార్వతీ. చాలీ చాలని సంపాదనే అయినా పిల్లలిద్దరూ ఉన్నత స్థానాల్లో నిలబడాలన్న కోరికతో వారి అభిరుచులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో పాఠశాల స్థాయిలోనే వ్యాయామ ఉపాధ్యాయుడు రామారావు శిక్షణలో కబడ్డీ, అథ్లెటిక్స్, టెన్నికాయిట్ క్రీడల్లో రాణించడం మొదలు పెట్టింది మౌనిక. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలెన్నో సాధించింది. కోచ్ టెన్నికాయిట్ తనకు సరైన ఎంపిక అని చెప్పడంతో దానిలో మరింత పట్టు సాధించాలనుకుంది. సాధన కోసం రోజూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్నిమాపక దళ కేంద్రం ఆవరణలో ఉన్న మైదానానికి వస్తోంది. ఓ పక్క చదువు కొనసాగిస్తూనే మరోపక్క ఆటపై దృష్టి సారించడం కాస్త కష్టమే అయినా వెనుకడుగు వేయలేదు మౌనిక. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న రెడ్డి సత్తిబాబు, పార్వతీ దంపతుల కుమార్తె మౌనిక. టెన్నీకాయిట్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
టెన్నికాయిట్ క్రీడల్లో జాతీయ స్థాయిలో కీర్తి పతకాలు ఎగురవేస్తున్న.. విజయనగరం అమ్మాయిలు
Tennikoit Sport : రెడ్డి మౌనిక ఇప్పటి వరకు కేరళ, తమిళనాడు, నూజివీడు, దిల్లీ, కోల్ కత్తా, రాజస్థాన్, బెంగళూరు, చత్తీస్గడ్, పంజాబ్‌లలో 16 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది. 25 సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కైసవం చేసుకుంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2.5 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలూ అందుకుంది. ఇవేకాక ఈ ఏడాది దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జరిగిన టెన్నికాయిట్ 5వ ప్రపంచ కప్పు పోటీల్లో భారత్ తరఫున పాల్గొంది. ఆరుగురు క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచింది. పది దేశాలకు చెందిన ఆటగాళ్లతో పోటీ పడి బంగారు పతకం సాధించింది. ఇదే పోటీల్లో వ్యక్తిగత ఛాంపియన్ షిఫ్‌లో భాగంగా డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
'నా విజయాల వెనుక కోచ్ రామరావు శిక్షణతో పాటు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రపంచ కప్పు విజయంతో ఆగిపోకుండా మరిన్ని పతకాలు సాధించాలి, రక్షణ రంగంలో స్థిరపడి మరింత మంది మహిళా క్రీడాకారులను తయారు చేయాలన్నదే నా ఆకాంక్ష.' -రెడ్డి మౌనిక
'అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మౌనిక ప్రతిభతో కొండలక్ష్మీపురం గ్రామానికి టెన్నీకాయిట్ క్రీడలో ఉమ్మడి విజయనగరంజిల్లాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. వీరి తల్లిదండ్రుల చొరవ, ప్రొద్బలంతోనే ఇది సాధ్యమైంది. అదేవిధంగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న ఆర్ధిక సహాయ సహకారాలు వెలకట్టలేనివి. మౌనిక ప్రత్యేక శిక్షణ కోసం చీపురుపల్లి అగ్నిమాపక అధికారి హేమసుందర్ స్టేషన్ ఆవరణలోనే పలు వసతులు కల్పించటం అభినందనీయం. తోటి క్రీడాకారిణిలు రేణుక, ప్రవల్లిక, శ్రావణి, రెడ్డి మౌనిక ప్రతిభపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మౌనికను స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రతిభకు మరింత మెరుగు పెడతామని చెబుతున్నారు.' -మత్స్య రామారావు, టెన్నీకాయిట్ కోచ్
రోజు కూలీల బిడ్డ అయిన మౌనిక టెన్నీకాయిట్ ఆటలో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగటం అభినందనీయం. ఈమె స్ఫూర్తితో కొండలక్ష్మీపురంలో మరికొందరు బాలికలు టెన్నీకాయిట్ క్రీడ వైపు అడుగులు వేయటం హర్షణీయం.