Telugu First News Reader Shanti Swaroop Passed Away : 'నమస్కారం వార్తల్లోని ముఖ్యంశాలు అంటూ' చదివిన తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కంఠం మూగబోయింది. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే నేడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్‌లో తొలిసారి తెలుగు వార్తను చదివి, శాంతి స్వరూప్ రికార్డు సృష్టించారు. పదేళ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు.
Shanti Swaroop Died in Hyderabad : బుల్లి తెరలో ప్రసారమైన తెలుగు వార్తల్లో మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా శాంతి స్వరూప్ (News Reader Shanti Swaroop) పేరు చరిత్రలో నిలిచిపోయింది. నేటికీ వార్తలంటే 80, 90 దశకాల ప్రేక్షకులకు ఆయన పేరే గుర్తుకు రావడం సహజం. ప్రశాంతవదనం, స్పష్టమైన పద ఉచ్ఛారణ, గంభీరమైన కంఠంతో ఏమాత్రం తొణికిసలాడకుండా వార్తలు చదవడంలో శాంతి స్వరూప్‌ది ప్రత్యేక శైలి. నేడు వార్తలు చదువుతున్న ఎందరో న్యూస్ రీడర్లకు వారు ఆదర్శం. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు.
Leaders Condolence on Gaddar Death : 'గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'
Doordarshan Shanti Swaroop Death : 1983 నవంబర్ 14న సాయంత్రం 7:00 గంటలకు తొలిసారిగా తెలుగులో వార్తలను ప్రసారం చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఓ వైపు బాలల చలన చిత్రోత్సవాలు, మరోవైపు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రెండింటిని ప్రధాన అంశంగా ఆరోజు వార్తల్లో శాంతి స్వరూప్ ప్రస్తావించారు. వార్తలు ప్రారంభించే ముందు మొదటి అంశంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేకంగా పంపించిన సందేశాన్ని ప్రేక్షకులకు చదివి వినిపించారు.
2011లో పదవీ విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ దూరదర్శన్‌లో పని చేశారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తప్పులు లేకుండా స్క్రిప్ట్‌ను చూడకుండా చదవాలని వార్తలను కంఠస్తం చేసినట్లు, పలు ఇంటర్వ్యూల్లో శాంతి స్వరూప్ స్వయంగా పేర్కొనడం విశేషం. తన గాత్రం, వార్తల ప్రజెంటేషన్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటు.
CM Revanth Reddy Condolence to Shanti Swaroop Death : తొలి తరం న్యూస్ రీడర్‌గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మరణం బాధాకరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 1983 నుంచి న్యూస్ రీడర్‌గా ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. శాంతి స్వరూప్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
శాంతి స్వరూప్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం (Condolence to Shanti Swaroop) ప్రకటించారు. ఆయన మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. శాంతి స్వరూప్ మరణం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సైతం సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- .
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగు దూరదర్శన్‌లో వార్తలు అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఆయనేనని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు.