Sampath Kumar Teacher Select National Teacher Award : గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్ 100కు టీచర్ సంపత్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఆ యజ్ఞంలో భాగంగా ఇప్పటికే 53 మందిని ఆవిష్కర్తలుగా తయారు చేశారు. 8 అంతర్జాతీయ, 16 జాతీయ, 30కి పైగా రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో 2018 నుంచి 2023 వరకు వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో దేశాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు సంపత్‌కుమార్ కృషి చేస్తున్నారు.
బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విద్యనభ్యసించి ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకున్నారు. ఆ అవకాశం దక్కకపోవడం వల్ల ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. తాను శాస్త్రవేత్త కాలేకపోయినప్పటికీ విద్యార్థులను ఆవిష్కర్తలుగా మార్చాలనే సంకల్పంతో నిరంతరం పరిశ్రమిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి అవిరళ కృషికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం లభించింది. టీచర్ వృత్తి కేవలం ఉద్యోగంలా కాకుండా అభిరుచితో విద్యార్థులతో ఆవిష్కరణలు చేయిస్తున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కిందని సంపత్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎయిట్ ఇంక్లైన్‌కాలనీకి చెందిన సంపత్‌కుమార్ 2001 డీఎస్సీలో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు. 2012లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది 2022 నుంచి సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని సైన్స్‌లో మెరికల్లా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ 100 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 53 మంది బాల, బాలికలను ఆవిష్కర్తలుగా మార్చడమే కాదు పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాల్ని దక్కించుకున్నారు.
సైన్స్ కృత్యాలు బంజారా భాషలో అనువాదం : కరోనా మహమ్మారి సమయంలో టీ-శాట్ ద్వారా నిర్వహించిన డిజిటల్ తరగతులకు సంబంధించి సంపత్‌కుమార్ పాఠ్యపుస్తకాల వ్యాసకర్తగా వ్యవహరించారు. ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలకు రిసోర్స్ పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సైన్స్ కృత్యాలను బంజారా భాషలోకి అనువదించి ప్రశంసలు పొందారు. విద్యార్థులు సైతం సంపత్‌కుమార్ పాఠ్యాంశాలు చెప్పే పద్ధతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయం అర్ధం కాకపోయినా ఓపిగ్గా వివరిస్తారని, ఇన్నోవేషన్స్‌లో జాతీయస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందని బాల,బాలికలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"నా మొదటి నియామకం పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేటలో ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం జరిగింది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఇన్నోవేటల్గా మలచాలనే లక్ష్యంతో మిషన్ 100 అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు 53 మంది విద్యార్థులను ఇన్నోవేటల్గా మలిచాను. దాదాపు 16 మంది విద్యార్థులు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకున్నారు. 8 మంది అంతర్జాతీయ అవార్డులు, 30 మందికి పైగా రాష్ట్రస్థాయి అవార్డులు గెలుచుకున్నారు. ఈ జాతీయ అవార్డు విద్యార్థులది, నా సహచర ఉపాధ్యాయులది." - తాండూరి సంపత్ కుమార్, ఉపాధ్యాయుడు
ఫెస్టివల్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆవిష్కరణ వివరణ : ఫెస్టివల్ ఆఫ్ సైన్స్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన ఆవిష్కరణను వివరించే అవకాశం దక్కిందన్న సంపత్‌కుమార్, మిషన్ 100పూర్తిచేసే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. సో ఆల్ ది బెస్ట్ టూ బెస్ట్ నేషనల్ టీచర్ సంపత్ కుమార్ సార్.