Telangana State Police Academy : లాల్‌బహుదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీ. 150 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి. రామరావు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీగా ఉన్న ఈ కేంద్రం విభజన తర్వాత తెలంగాణ పోలీసు అకాడమీగా మారింది.
ఈ తెలంగాణ పోలీసు అకాడమీలో ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అకాడమీలో 2023కు బ్యాచ్‌కు చెందిన 535మంది సబ్ ఇన్స్‌పెక్టర్లకు శిక్షణ కొనసాగుతోంది. వీరిలో 401 సివిల్, 29మంది స్పెషల్ పోలీసు, 71మంది ఆర్మ్‌డ్ రిజర్వు, 12 మంది ఎస్పీఎఫ్, 22 మంది ఐటీ కమ్యూనికేషన్‌తో పాటు మరో 9 మంది ఫింగర్ ప్రింట్, మూడుగురు ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది.
శాంతి భద్రతలు సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరగకుండా కాపాడేవారే పోలీసులు. అలాంటి పోలీసులు శారీరకంగా ధృడంగా ఉంటేనే ప్రజలను రక్షిస్తారు. అందుకు ఎంతో కఠోర శిక్షణ అవసరం. ఈ శిక్షణ కోసం ఇలా ఉదయాన్నే లేచి సన్నద్ధమవుతారు. ఇక్కడ శిక్షణ పొందేవారిలో పురుషులే కాదు, మహిళా ఎస్సైలకు కూడా ఉన్నారు. పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా మహిళలు తీసుకుంటున్న శిక్షణ చూస్తే వీరికి ఇదెలా సాధ్యమనే సందేహం కలగక మానదు. ఈ అకాడమీలో ఎస్సైల శిక్షణతో పాటు 853 మంది మహిళా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు కూడా శిక్షణ ఇస్తున్నారు. వీరూ ఉదయాన్నే లేచి కఠోర శిక్షణ తీసుకుంటూ రాటుదేలుతున్నారు.
మహిళలు అందులోనూ పోలీసు శిక్షణ అంటే ఇంటి దగ్గరుండే తల్లిదండ్రులకు ఎంతో భయం. తమ బిడ్డ ఎట్లా ఉంటుందో అని. కానీ, ఇక్కడ ట్రైనింగ్ ఆఫీసర్లు తీసుకుంటున్న శ్రద్ధ చూసుకుంటున్న తీరు, మహిళలకు కల్పిస్తున్న సదుపాయాలతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. కొత్తగా పోలీసు వృత్తిలోకి వచ్చే మహిళలకు ధైర్యానిస్తున్నారు. మహిళలకు పోలీసు శిక్షణ అంటే పురుషులతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుందని అంతా భావిస్తారు. కానీ, ఈ అకాడమీలో ముందు పోలీసు తర్వాతే తను మహిళ అన్న ప్రాధాన్యతతో శిక్షణ ఇవ్వడం విశేషం. అలా చూడటంతోనే శిక్షణలో పూర్తిస్థాయిలో రాటుదేలామని అంటున్నారు ట్రైనీ ఆఫీసర్లు.
యువతులే కాదు చంటి పిల్లల తల్లులు కూడా పోలీసు ట్రైనింగ్‌లో ఉండటం ఆసక్తికర విషయం. శిక్షణ ఎలా ఉంటుందో అని భయంతో వచ్చిన వారిని ఈ కేంద్రం అప్యాయంగా అక్కున చేర్చుకుంది. వారికి ప్రత్యేక వసతులు కల్పించి మేటి మహిళ పోలీసులుగా తయారు చేస్తోంది. ఈ వెపన్ డ్రిల్ కూడా పోలీస్ శిక్షణలో ముఖ్యమైంది. ప్రతి ఒక్క పోలీసు తన శిక్షణలో భాగంగా కీలకమైన వెపన్ డ్రిల్ నేర్చుకోవాలి. దీనితో పాటు స్క్వాడ్ డ్రిల్, సెల్యూట్ చేయడంపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పోలీసులకు శిక్షణలో అత్యంత కీలకమైంది అవుట్‌డోర్ శిక్షణ. ఇందులో వ్యాయామం, జంగిల్ క్రాసింగ్, రోప్ క్లైంబింగ్, ఫైర్ మెన్ లిఫ్టింగ్, క్రావెలింగ్, డిస్, క్యాట్ వాక్ వంటివి శిక్షణ ఇస్తుంటారు.
ఒకే ఒక్కడు - తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి శౌర్య పతకం - PRESIDENT GALLANTRY MEDAL 2024
ఇలాంటి శిక్షణ ఉంటుందని కలలో కూడా ఈ మహిళ పోలీసులు ముందుగా అనుకుని ఉండకపోవచ్చు. నేలపై వీరు చేస్తున్న కసరత్తులు చూస్తే పాపం అనిపిస్తుంది. కానీ, శిక్షణలో ఎంత రాటుదేలితే నిజ జీవితంలో అంత ధృడంగా ఉంటారన్నది ఇక్కడి శిక్షకుల అభిప్రాయం. కాస్త ఇబ్బందైనా తప్పదంటూ శిక్షణ ఇస్తున్నారు. 11 రకాల ఆయుధాలు అంటే 9mm పిస్టల్, 9mm కార్బన్, ఏకే 47 లాంటి వినియోగంపై వీరికి శిక్షణ ఇస్తున్నారు. తుపాకులు పేల్చడమే కాదు, వాటిల్లోని భాగాలు, అవి ఎన్ని రకాలు, విడదీసి తిరిగి కలపడం ఎలా లాంటి పూర్తి శిక్షణను వెపన్ ట్రైనింగ్‌లో వీరికి అందిస్తారు.
"మాకు పోలీస్ వృత్తిలోకి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అదృష్టం, మా శ్రమ తోడయ్యాయి. దీంతో ఈ విజయం సాధ్యమైంది. పోలీసులంటేనే ఒకప్పుడు భయపడే పరిస్థితి. అలాంటిది ఎస్సైగా విధులు నిర్వర్తించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సవాల్‌ను స్వీకరించడం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాము." - ట్రైనీ ఎస్సైలు