Telangana Medical Council Raids on Fake Doctors : ఒంట్లో సుస్తి చేస్తే వెంటనే మనకు గుర్తుకువచ్చేది దగ్గరలోని క్లినిక్. అక్కడ వచ్చిన రోగాలను నయం చేస్తారని రోగులు భావిస్తారు. తమ రోగాలను నయం చేస్తారనే భరోసాతో ఆ వైద్యుడి దగ్గరకు వెళ్లి వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తారు. అయితే ఇప్పుడు ఆ చికిత్స చేస్తోందని నిజమైనా డాక్టరేనా అన్న అనుమానం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య మండలి జరుపుతున్న దాడుల్లో నివ్వురపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకరోజు క్రితమే హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల మెడికల్ కౌన్సిల్ స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహించి భారీగా నకిలీ వైద్యులను గుర్తించింది. ఇప్పుడు తాజాగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 55 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.
నకిలీ వైద్యుల ఆట కట్టించే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ వైద్య మండలి సభ్యులు దాడులు చేపట్టారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేసి 55 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. పరిధి దాటి వైద్యం చేస్తున్న 55 మంది నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోనూ వైద్య మండలి విస్తృత స్థాయిలో దాడులు చేసిన విషయం తెలిసిందే.
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో అర్హత లేకుండానే ఎంబీబీఎస్ వైద్యులుగా చలామణి అవుతూ రోగులకు విచ్చలవిడిగా యాంటి బయోటిక్, స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇవ్వటంతో పాటు గర్భ విచ్ఛిత్తి చేస్తున్నారని గుర్తించారు. కొన్ని చోట్ల ఆపరేషన్ థియేటర్లు సైతం ఉన్నాయని తెలంగాణ వైద్య మండలి సభ్యులు పేర్కొన్నారు. తెలంగాణ వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, యాంటీ క్వాకరీ బృంద సభ్యులు, పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
Fake Doctors in Hyderabad : హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో మేడ్చల్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో ఎనిమిది బృందాలు దాడులు చేశాయి. కొందరు కనీస డిగ్రీ లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్నట్లు తెలుసుకున్నారు. మరికొందరైతే పలు ఆసుపత్రుల్లో నర్సింగ్ వంటి సేవలు అందించి తర్వాత సొంతంగా ఎంబీబీఎస్ వైద్యులమని చెప్పి క్లినిక్‌లు నడుపుతున్నట్లు తేలింది. వీరు ఇష్టానురాజ్యంగా అధిక సంఖ్యలో రోగులకు యాంటీబయోటిక్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్నారు. ఇలా నకిలీ వైద్యులను అరికట్టడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
నకిలీ వైద్యుల నిర్వాకం- సంతానం కోసం వెళ్తే ప్రాణమే తీసేశారు!