Political Leaders Cast Their Vote in Telangana 2024 : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాధారణ పౌరులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు తమ తమ పోలింగ్ బూత్‌లలో ఓటు వేసి 'మా వంతు అయిపోయింది, ఇక మీ వంతే మిగిలింది' అంటూ సందేశమిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
Telangana Lok Sabha Elections Polling : హైదరాబాద్ బర్కత్‌పురాలో కిషన్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్‌రెడ్డి పాఠశాలలో వెంకయ్యనాయుడు దంపతులు ఓటేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, నల్గొండలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన నేతలు : సికింద్రాబాద్‌లోని సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సెయింట్ రీటా పాఠశాలలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఓటేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అంతర్గాంలో, మంచిర్యాల కార్మెల్న్ హై స్కూల్లో చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేకానంద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిర్యాలగూడలోని చైతన్య హై స్కూల్లో ఎమ్మెల్యే బీఎల్‌ఆర్, డౌహిల్ స్కూల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. నల్గొండలోని ఎమ్‌వీఆర్ హై స్కూల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు.
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కువు యువత వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సూర్యాపేటలోని 95వ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, కామారెడ్డి పట్టణంలోని వడ్డేర కాలనీలో శాసనసభ సభ్యుడు వెంకట రమణారెడ్డి ఓటేశారు. సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఊరెడ్డిపల్లి గ్రామంలో శాసనసభ సభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓటేశారు.
TS Lok Sabha Elections 2024 : నిజామాబాద్ జిల్లా ధర్మరాం (బి) గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు దంపతులు, డిచ్‌పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ గ్రౌండ్‌లో రాజసభ సభ్యుడు లక్ష్మణ్, మేడ్చల్ జిల్లా ఆదిత్యనగర్‌లోని విజయ హై స్కూల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఓటేశారు.
యాదాద్రి భువగిరి జిల్లా ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే మందుల సామేల్ దంపతులు, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బహదూరపుర ఎమ్మెల్యే ముహమ్మద్ తీగలకుంట ప్రాంతంలోని 204వ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.