Telangana HighCourt Stay on Suspension SERP Employees : సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని, 106 మంది సెర్ప్ ఉద్యోగులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే దీనిపై సస్పైండైన ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. సెర్ప్ ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని ఉద్యోగుల తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
అసలేం జరిగిదంటే : ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో సెర్ప్, ఉపాధి హామీ ఉద్యోగులతో మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్‌రెడ్డి, మరికొందరు నేతలు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. భేటీలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు కాగా 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.