Telangana High Court on CM Revanth Reddy Case : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. రేవంత్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల జోలికి వెళ్లకుండా జులై 6కు వాయిదా వేయడాన్ని తప్పుబట్టింది. ఆ ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, వాటిపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించకపోవడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది, సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రసంగించారన్నారని పేర్కొన్నారు.
400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. ఆ అరోపణలపై మేజిస్ట్రేట్‌కోర్టులో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి అందులో ఆధారాలుంటే విచారణకు పరిగణనలోకి తీసుకొని నోటీసులు జారీ చేయడం లేదంటే దర్యాప్తు నిమిత్తం పోలీసులకు పంపడం వంటివి చేయాల్సి ఉండగా కేవలం వాయిదా వేయడం సరికాదని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మూసివేశారు.
HC on MLA's Disqualification Case : మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంతో పాటు ప్రభుత్వం, ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్లకు అదేశాలు జారీచేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్ వద్ద పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలని గత వారం ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
అనర్హత పిటిషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామంటూ అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ప్రతివాదులైన సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌లకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేశారు.