Telangana Graduate MLC BY Election 2024 : రాష్ట్రంలో మరో ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈసీ షెడ్యూలు ప్రకటించింది. మే 2న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 9 వరకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు ఉంటుంది. మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీగా ఏర్పడిన స్థానంలో ఈ ఉపఎన్నిక జరగనుంది.
ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవీకాలం ఉంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబరు 9న రాజీనామా చేశారు. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలన్నది నిబంధన. దీంతో మే 27న పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
Teenmar Mallanna as Congress MLC Candidate : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా తీన్మార్ మల్లన్న కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని ప్రజలకు వినిపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి అనేక సార్లు జైలుకు వెళ్లారు.
2021లో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు వినిపించింది. అయితే అక్కడ వెలిచాల రాజేందర్ రావును అదిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మలన్నను ఎమ్మెల్సీగా బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం ప్రకటన చేసింది.
పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని పట్టభద్రులు ఓటర్ల నమోదు చేసుకునే గడువు పూర్తవడంతో తాజాగా తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
ఎమ్మెల్సీలుగా మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం - ఈసీ ప్రకటన