Telangana Govt Exercise On New Revenue Act : ఆర్వోఆర్-2024 కొత్త చట్టం రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దీపావళికి ఆర్వోఆర్ చట్టాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టులో ఆర్వోఆర్-2024 చట్టం ముసాయిదాను సిద్ధం చేసిన సర్కార్ అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించింది. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలాల్లో సెప్టెంబరులో పైలట్ భూ సర్వే చేసింది. ఇలా సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, చట్టానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది. గ్రామస్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, సమస్యలపై అప్పిలేట్ అథారిటీ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో భూ కమిషన్ ఏర్పాటుచేయాలని అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
దీపావళి నుంచి అందుబాటులోకి : ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్‌పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వోఆర్ 2024 రూపకల్పన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. డ్రాఫ్ట్‌పై అభిప్రాయాలను సేకరించిన అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసాయిదా పత్రాన్ని అందజేశారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణపై మంత్రి తాజాగా సీఎంతో చర్చించినట్లు సమాచారం. త్వరలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ముసాయిదాపై చర్చించనున్నారు. అనంతరం శాసనసభ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా గానీ, ఆర్డినెన్స్ జారీ ద్వారా గానీ కొత్త చట్టాన్ని దీపావళి నుంచి అమలులోకి తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల నియంత్రణకు పదునైన భూ ఆక్రమణల నిరోధక చట్టం తీసుకురావాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. దీనిపై రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి మంత్రి పొంగులేటి తాజాగా సూచనలు, సలహాలు స్వీకరించినట్లు తెలిసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.
గ్రామ రక్షణ సిబ్బంది : గ్రామస్థాయిలో భూముల రక్షణకు, రెవెన్యూ సేవలకు ఒక సహాయకుడిని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఏలను గానీ, అర్హులైన వారిని పరీక్ష ద్వారా ఎంపిక చేసి కానీ గ్రామ రక్షణ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భూ మాత పోర్టల్ : ధరణి పోర్టల్ స్థానంలో భూ మాత పేరుతో పోర్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్‌ను ప్రైవేటు సమస్థ నుంచి ప్రభుత్వ ఎన్‌ఐసీకి బదలాయింపు ప్రక్రియను సర్కార్ ఇటీవల పూర్తి చేసింది. ఇక పేరు మార్పు మారిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ధరణి పోర్టలల్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు పరిష్కృతం చేశారు. కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. నూతన చట్టంలో సాదాబైనమాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగానే పోర్టల్‌లో ఐచ్ఛికాలు ఇచ్చి రెవెన్యూ దస్త్రాల్లో మార్పులు చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ఆర్వోఆర్ చట్టంలో వెసులుబాటు లేక సాదాబైనామాలు పెండింగ్ పడుతూ ఉన్నాయి.
నూతన ఆర్వోఆర్ చట్టం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి? - Pratidhwani On New ROR Act