Latest Updates on Gruha Jyothi Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో గృహజ్యోతి ఒకటి. ప్రజలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. గతంలో ప్రజాపాలన పెట్టి.. ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందులోనే గృహజ్యోతికి కూడా ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే.. ఆ అప్లికేషన్ల ఆధారంగా కొందరికి పథకం అమలవుతుండగా.. మరికొందరికి అమలు కావట్లేదు. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేదు. ఈ క్రమంలోనే గృహజ్యోతి వినియోగదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పంది. ఇప్పటివరకు దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా అర్హులకు మరో అవకాశం కల్పించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడానికి కొత్త ఐచ్ఛికాన్ని అందుబాటులో ఉంచింది. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న దరఖాస్తు వివరాలను కొందరు ఆపరేటర్లు సరిగా ఆన్లైన్లో ఎంటర్ చేయలేదు. మరికొందరు అవగాహన లేక ఆరు గ్యారంటీల్లో కొన్నింటికి టిక్ చేయలేదు. ఇలా ఎవరైతే గ్యారంటీల ఎదుట బాక్స్‌లలో టిక్ చేయలేదో వారికి మొన్నటి వరకు ‘నాట్ అప్లయ్’ అనే సమాచారం వచ్చింది. దీంతో అర్హులు ఏడు నెలలుగా గృహజ్యోతి పథకానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నాట్ అప్లయ్ అనే సమాచారం వచ్చిన బాక్స్‌లో టిక్ పెట్టే అవకాశం లేకపోవడంతో అర్హులు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నారు. తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం మొన్నటి వరకు కేవలం సవరణకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు "నాట్ అప్లయ్" ఆప్షన్‌ను కూడా సవరించుకోవడానికి కొత్త ఐచ్ఛికాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అర్హులైన వారు ప్రజాపాలన కేంద్రాలకు వెళ్లి వివరాలను అప్‌డేట్ చేయించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇలా వివరాలు అప్‌డేట్ చేయించుకునే వారికి వచ్చే నెల నుంచి 200 యూనిట్ల వరకు జీరో బిల్లు పథకం వర్తిస్తుంది.
ఈ పత్రాలు వెంట తీసుకెళ్లాలి: ప్రజాపాలన కేంద్రాలను ఆయా మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం దరఖాస్తుదారులు ఏ మండల పరిధిలో అప్లై చేశారో అక్కడికే వెళ్లి వివరాలు అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గానూ.. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజాపాలన అప్లికేషన్, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, విద్యుత్తు బిల్లులోని యూఎస్‌సీ(USC) నంబర్‌ను వెంట తీసుకెళ్లి.. వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలి. ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి అర్హత లభిస్తుంది.
అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్ - గృహజ్యోతి వారికి కూడా వర్తింపు