LRS MODIFICATION IN TELANGANA : సరైన అనుమతులు లేని లే-అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద తమ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు లబ్ధిదారులంతా దరఖాస్తులు చేసుకున్నారు. తమకు పూర్తిస్థాయి హక్కు పత్రాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. LRS కోసం లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల్లోనే పలు సమస్యలు గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇవి కూడా భారీ స్థాయిలో ఉన్నట్టు తెలిపింది.
75 శాతం దరఖాస్తుల్లో..
ఎల్‌ఆర్‌ఎస్ కింద అందిన దరఖాస్తుల్లో.. దాదాపు 75 శాతం అప్లికేషన్లలో పూర్తి వివరాలు లేవని సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో.. అవసరమైన పత్రాలను మళ్లీ అప్‌లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు ఛాన్స్ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అప్‌లోడ్ చేయాలంటూ.. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
అక్టోబరు 15లోపు అందిన వాటికే..
ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్ల పరిశీలనను సర్కారు ఈ సంవత్సరం జనవరిలో మొదలు పెట్టింది. చట్ట విరుద్ధమైన, అనుమతి లేని లే-అవుట్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిబంధనలు జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం.. రాష్ట్రంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131.. దీంతోపాటు 2023 జులై 31న విడుదల చేసిన జీవో 135లో ఉన్న రూల్సే LRSకు వర్తిస్తాయి. అదేవిధంగా.. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు రిజిస్టర్ అయిన.. చట్ట విరుద్ధమైన, అనుమతి లేని లే-అవుట్లు, ప్లాట్లకు మాత్రమే ఈ LRS పథకం వర్తిస్తుందని ప్రకటించింది. అదికూడా.. అదే సంవత్సరం అక్టోబరు 15లోపు సర్కారు అందిన అప్లికేషన్లను మాత్రమే లెక్కలోకి తీసుకోనున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇచ్చారు.
ఆమోదం పొందినవి కొన్నే...
రాష్ట్ర సర్కారు వద్ద ఉన్న మొత్తం 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా.. వాటిలో 60,213 మాత్రమే ఆమోదం పొందాయి. ఈ దరఖాస్తుల నుంచి ప్రభుత్వానికి రూ.96.90 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవి పోగా.. మిగిలిన సుమారు 75 శాతం దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేవని అధికారులు గుర్తించారు. ఈ విధంగా సరైన పత్రాలు, వివరాలు ఇవ్వని వారికోసం.. మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈసీ, సేల్ డీడ్, లే-అవుట్ కాపీ, మార్కెట్ వాల్యూ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను అప్లికేషన్లకు యాడ్ చేయవచ్చు.
ఓటీపీ ద్వారా..
దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, అడ్రస్ లేదా ఇతర వివరాలను.. సెల్‌ఫోన్‌కు వచ్చే OTP ద్వారా సవరించుకునే ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే.. వాటిని తీర్చుకునేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లలో.. "హెల్ప్ డెస్క్"లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. LRS దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలున్నవారు.. ఈ కేంద్రాలను సంప్రదిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.