TG Government Working on State Roads To National Highways : రోడ్లు, భవనాల శాఖకు చెందిన వివిధ రోడ్లను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించే కసరత్తును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఉన్న 16 ప్రాంతాల్లో 1,767 కిలోమీటర్ల మేర రోడ్లను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించడం లేదా జాతీయ రహదారులకు వాటిని అనుసంధానించాలనేది ప్రభుత్వ ఆలోచన. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా రోడ్ల వివరాలతో ఆకృతులు సిద్ధం చేసింది. వీటిని మరోసారి కేంద్రానికి ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు త్వరలో సిద్ధం చేసిన నివేదికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలిపేలా 16 రోడ్లకు సంబంధించిన ఆకృతులతో ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూరు పట్టణం NH-44పైన ఉంటుంది. భూత్పూరు వయా నాగర్‌కర్నూల్, మద్దిమడుగు, మన్ననూరు వెళ్లే రహదారి రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉంది. ఈ రహదారిని నాగర్‌కర్నూల్, మన్ననూరు, మద్దిమడుగు మీదుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీగిరిపాడు, గంగాలకుంటలను కలుపుతూ నేషనల్ హైవే ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారికి అనుమతి వస్తే కృష్ణా నదిపై వంతెనను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి దూరం తగ్గుతుంది.
రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati