800 Acres for Musi Residents : మూసీ నది ప్రక్షాళనకు పూనుకున్న ప్రభుత్వం, ఇందుకోసం కసరత్తులు తీవ్రం చేసింది. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు మంత్రులతో కూడిన అధికారుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటిస్తోంది. అక్కడి నదుల ప్రక్షాళనను లోతుగా అధ్యయనం చేస్తోంది. అక్కడి నదులను కొరియా ప్రభుత్వం సుందరీకరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేయాలని చూస్తున్నారు. అయితే ఇందుకు మూసీ గర్భంలో ఉంటున్న వారితో పాటు బఫర్జోన్లో ఉన్న వారినీ ఖాళీ చేయించాల్సి ఉంది. ఇదే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
మూసీ గర్భంలో ఉన్న దాదాపు 1600 మందిలో మూడొంతుల మంది ఇళ్లు ఖాళీ చేసి, ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తీసుకోవడానికి ముందుకొచ్చారు. అందులో ఓ 250 మంది ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే బఫర్ జోన్లో ఉన్నవారు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న మొత్తం చాలదని, పూర్తిస్థాయి పరిహారం ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ భీష్మించుకు కూర్చున్నారు.
ఒప్పించి, మెప్పించాకే ఇళ్లు ఖాళీ : ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో కొద్దిరోజుల కిందట మంత్రి పొంగులేటితో చర్చించారు. బఫర్ జోన్లో ఉన్న నిర్వాసితులకు ఇళ్ల స్థలాలూ ఇస్తే బాగుంటుందని ఆయన చెప్పడంతో ముఖ్యమంత్రి సైతం అందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సియోల్లో అక్కడి నిర్వాసితులకు కొరియా ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే మూసీ నిర్వాసితులకూ మెరుగైన పరిహారం ఇచ్చి వారికి న్యాయం చేయడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు వారిని ఒప్పించాకే ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వారికి భూములు ఇచ్చాకే ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
'మీ ఇల్లు మూసీ బఫర్ జోన్లో ఉందా? - మీరు భయపడాల్సింది బుల్డోజర్కు కాదు వీళ్లకు'
ఇదే విషయాన్ని సియోల్ పర్యటనలో మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బఫర్ జోన్లో ఉన్న బాధితులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో బాధిత కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలం అందించాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు 650 నుంచి 800 ఎకరాలు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. ఆ స్థలాలు ఎక్కడ ఇవ్వాలి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయనే దానిపై అన్వేషణ మొదలెట్టారు.
ఈ క్రమంలోనే ఓఆర్‌ఆర్ సమీపంలో ప్రభుత్వ భూములు ఉండటంతో అక్కడ లెక్కలు తీస్తున్నారు. ఎక్కడ ఎంత భూమి ఉంది అనే వివరాలను త్వరలోనే మంత్రికి నివేదించనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఒకేచోట కాకున్నా, రెండు, మూడు చోట్లనైనా సేకరించి లే అవుట్లు వేసి సకల సదుపాయాలు కల్పించి బాధితులకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ గజం భూమి రూ.50 వేలకు పైన ధర పలికే అవకాశం ఉండటంతో బఫర్జోన్లోని నిర్వాసితులూ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని భావిస్తున్నారు.
హాన్ నది తరహాలో మూసీ సుందరీకరణ - అందర్నీ ఒప్పించి, మెప్పించే పునరుద్ధరణ'