Kalyana Lakshmi Scheme : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి 1,00,116 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.1,450 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కల్యాణలక్ష్మి పథకం కోసం బీసీ సంక్షేమ శాఖ 1450 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి లబ్దిదారుల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం ఉంది. మరి, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దరఖాస్తు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కల్యాణ లక్ష్మీ పథకానికి అర్హతలు
- కల్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు శాశ్వతంగా తెలంగాణ వాసులై ఉండాలి.
- వధువుకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- వరుడి వయస్సు కనీసం 21 ఏళ్లపైన ఉండాలి.
- కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి.
ఎలాంటి పత్రాలు అవసరం?
- వధువు ఫొటో
- వధువు బర్త్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- వధువు, ఆమె తల్లి బ్యాంకు పాస్‌బుక్ కాపీ
- ఈ పత్రాలను స్కాన్ చేసి jpg ఫార్మాట్లో, సైజ్ 150KB కన్నా తక్కువ ఉండేలా సేవ్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.
- దరఖాస్తుదారులు ఆన్లైన్లో స్వయంగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ సేవా కేంద్రాన్ని సందర్శించినా సరిపోతుంది.
కల్యాణ లక్ష్మీ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కాస్త కిందకు స్క్రోల్ చేస్తే "కళ్యాణ లక్ష్మి" ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే దానిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు తెరుచుకున్న పేజీలో పైన కల్యాణ లక్ష్మీ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఇక్కడ "రిజిస్ట్రేషన్" అనే ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు పెళ్లికూతురు వ్యక్తిగత సమాచారం మొదలు కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలన్నీ సమర్పించాలి.
- ఆ తర్వాత వరుడి వయస్సు కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. మరికొంత సమాచారం అందించాలి.
- చివరలో అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి.
- సమాచారం మొత్తం అందించిన తర్వాత "Submit" ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
కల్యాణ లక్ష్మీ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి
- కల్యాణ లక్ష్మీ పథకం దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఆమోదం లభించిందా లేదా? అనే స్టేటస్ తెలుసుకునే సౌలభ్యం కూడా ఆన్లైన్లో ఉంది.
- ఇందుకోసం కూడా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోనే కల్యాణ లక్ష్మీను దర్శించాలి.
- దరఖాస్తు చేసే సమయంలో హోమ్ పేజీలో క్లిక్ చేసిన కల్యాణ లక్ష్మీ ఆప్షన్ పైనే క్లిక్ చేయాలి.
- ఇక్కడ Registration ఆప్షన్ కింద Pring/Status అనే ఆప్షన్ ఉంటుంది.
- ఇప్పుడు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే చాలు, వెంటనే సమాచారం అందిస్తుంది.
కల్యాణలక్ష్మి నిధులొచ్చాయి - అప్లై చేసుకున్న వారి ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు