పేదలు, రైతుల ఖాతాల్లోకి నగదు - ఎప్పటి నుంచంటే! - RAITHU BHAROSA SCHEME
నిరుపేదలకు నగదు బదిలీ, అన్నదాతలకు రైతుభరోసా పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2024, 10:18 AM IST
Raithu Bharosa Scheme In Telangana: భూమిలేని నిరుపేదలు, అన్నదాతలకు రైతుభరోసా పథకాల అమలుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని కుటుంబాలు 1.16 కోట్లు అని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. పట్టాదారు పాసుపుస్తకాలున్న మొత్తం రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేనట్టే. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ గుర్తింపు కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
లబ్ధిదారుల ఎంపిక: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులుండగా అందులో కేవలం 32 లక్షల మంది కార్డులు మాత్రమే చలామణిలో ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో వ్యవసాయ భూమిలేని లేకుండా దాదాపు 15 నుంచి 16 లక్షల వరకూ ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అందుకు రూ.6 వేల చొప్పున నగదు బదిలీకి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ అవసరం అని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఖరారు చేస్తుందన్నది కసరత్తు పూర్తయితే గానీ స్పష్టత రాకపోవచ్చు. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద కూలి కుటుంబానికి ఏటా రూ.12 వేలు ఇస్తామని అందులో తొలి విడతగా రూ.6 వేలను ఈ నెల 28న విడుదల చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతుభరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థికశాఖ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 14న సంక్రాంతికి రైతుభరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. అనర్హుల తొలగింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చించింది.
నిధుల సమీకరణకు ఏర్పాట్లు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రాష్ట్ర బడ్జెట్‌లో రైతుభరోసా పథకానికి రూ.15 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందున నిధుల విడుదలకు సమస్యలు లేవు. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి రూ.ఆరు వేల కోట్లను సమీకరించడమే అసలు సమస్య అని తెలుస్తోంది. సంక్రాంతి లోగా బాండ్ల విక్రయంతో మరో రూ.4 వేల కోట్ల వరకూ రుణాలు వచ్చే అవకాశాలున్నాయి. కిందటి వారంలో రూ.1500 కోట్ల రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది. దాంతో పన్నుల ద్వారా సైతం ఆదాయ వృద్ధిని పెంచాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించడం గమనార్హం. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో పన్నుల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీ ప్రకారం జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రైతుభరోసా ఇవ్వడానికి ఇబ్బందులేమీ ఉండవని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
24 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లు సొమ్ములు జమ - రైతుల్లో సంతోషం
Free Crop Insurance: గందరగోళంగా పంటల బీమా.. తీరని అన్యాయం జరిగిందంటున్న రైతుల
అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ.. అమరావతిలో రోడ్డెక్కిన రైతులు