Telangana Tax Revenue Increased : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలలో అత్యధికంగా పన్ను ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు సమర్పించిన ఆదాయ, వ్యయ వివరాల్లో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టులో పన్నుల ద్వారా రూ.13,146 కోట్లు వసూలు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికంగా నిలిచింది. జూన్‌లో రూ.12,190కోట్లు, జులైలో రూ.9,965 కోట్లు ఖజానాకు చేరాయి. జులైతో పోలిస్తే ఆగస్టులో ఆదాయం 30శాతానికి పైగా పెరిగింది.
పెరిగిన పన్ను ఆదాయం : ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5నెలల్లో పన్ను ఆదాయం రూ.57,772 కోట్లు కాగా బడ్జెట్ అంచనాతో పోలిస్తే 35శాతానికి పైగా ఉంది. ఆగస్టు వరకు జీఎస్టీ ద్వారా రూ.20,500కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,390కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.13,487 కోట్లు సమకూరాయి. ఆబ్కారీ శాఖ నుంచి రూ.7,806కోట్లు, కేంద్ర పన్నుల నుంచి రూ.6,220 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల ద్వారా రూ.3,316 కోట్లు సమకూరగా పన్నేతర ఆదాయం రూ.1,449 కోట్లు వచ్చింది.
కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.2,447కోట్లు : కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇప్పటివరకు రూ.2,447 కోట్లు వచ్చాయి. బడ్జెట్లో అంచనా వేసిన రూ.21వేల కోట్లలో పోలిస్తే వచ్చిన మొత్తం 11శాతమే. బడ్జెట్ లో రూ.2,21,242 కోట్ల రెవెన్యూ అంచనా వేయగా 5నెలల్లో 28శాతం అంటే రూ.61,618కోట్లు ఖజానాకు జమ అయ్యాయి. 5నెలల్లో ప్రభుత్వం రూ.29,449 కోట్ల రుణాలు తీసుకోగా బడ్జెట్లో అంచనా వేసిన రూ.49,255 కోట్లతో పోలిస్తే ఇది 60శాతంగా ఉంది. ఆగస్టు నెలవరకు ప్రభుత్వం రూ.85,467కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల వేతనాలకు రూ.18,152 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.10,497 కోట్లు, పెన్షన్లకు రూ.11,641 కోట్లు, రాయితీలపై రూ.5,398 కోట్లు వ్యయం చేసింది. ఆగస్టు నెల ముగిసే వరకు రూ.15,521 కోట్ల రెవెన్యూ లోటు రూ.29,449 కోట్ల ఆర్థికలోటు రూ.18,952 కోట్లు ప్రాథమిక లోటు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.