Industries Department Budget 2024 : రాష్ట్ర బడ్జెట్ 2024 కు సంబంధించి ప్రభుత్వం పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లను కేటాయించింది. యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయంని నెలకొల్పాలని నిర్ణయించింది. స్థానికంగా, విశ్వవ్యాప్తంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచస్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువతలో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్‌లో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో 17 రకాల వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు నిర్వహిస్తారు. నేరుగా పరిశ్రమలతో అనుసంధానం చేస్తారు.
నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దృష్టి : అధ్యయనం ఆచరణల మధ్య అంతరం లేనివిధంగా, ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తారు. దీనికోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. మూతపడిన నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఏడాది జనవరిలో ఒక కమిటీని నియమించింది. త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ఈ బడ్జెట్లో రూ.199 కోట్లను కేటాయించారు.
ప్రభుత్వ శాఖలకు, ఇతర ప్రభుత్వ సంస్థల అవసరమైన వివిధ వస్త్రాలను, విద్యార్థుల యూనిఫాంలు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్ షీట్లు వంటివి, తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా స్థానిక నేతన్నల నుంచే సేకరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో చేనేత, జౌళి పరిశ్రమలకు రూ. 370 కోట్లు కేటాయించింది. తెలంగాణాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
2,762 Crores Allotment to the Industries Dept : ఈ ఇన్స్టిట్యూట్ను రాష్ట్రంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్టైల్ ఏర్పాటుకు కూడా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పాటైతే రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా మార్చేందుకు వీలుగా మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం 2024-25 బడ్జెట్ లో నిధులు కేటాయించింది. తొలుత 25 ఐటీఐలను అభివృద్ధి చేసి పరిశ్రమ 4.0 పేరిట దీర్ఘకాల, స్వల్పకాల వ్యవధి కలిగిన కోర్సులు అమలు చేసేందుకు ఇప్పటికే టాటా టెక్నాలజీస్ సంస్థతో కార్మికశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఏటీసీలకు నిధులు కేటాయించింది.
ఐటీశాఖకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.773.86 కోట్లు కేటాయించింది. ఐటీ మౌలిక సదుపాయాలకు రూ.100కోట్లు, వీహబ్‌కు 9కోట్లు, టాస్క్‌కు రూ. 30 కోట్లు, టీహబ్‌కు రూ. 40కోట్లు, టీ ఫైబర్‌కు రూ. 50కోట్లు, టీవర్క్స్ కు 25 కోట్ల రూపాయలు కేటాయించింది.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024