డ్రగ్స్, గంజాయి అంశంలో ఎంతటివారున్నా వదిలిపెట్టం : సీఎం రేవంత్
ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ వరకు సాగునీటి వనరులుగా మూసీ ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు గినట్లు మెట్రో విస్తరణ చేశామన్నారు. త్వరితగతిన రీజినల్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని మాటిచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రగ్స్, గంజాయి అంశంలో ఎంతటివారున్నా వదిలిపెట్టమని చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అధికారం రాగానే ఆడపడుచులకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10లక్షలకు పెంచుతూ అమల్లోకి తెచ్చామని వివరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని గుర్తు చేశారు. 30 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ ఏడాది 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్ల నిధులు మంజూరు చేశామని ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూల్ నిర్మించడం తమ బాధ్యత అని, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. అమ్మా ఆదర్శ పాఠశాల పథకం కింద 26 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.