Telangana Farmers to Start Cotton Farming : నైరుతి రుతుపవనాల రాకతో వరంగల్ జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఆశాభావంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పొలంబాట పట్టారు. దుక్కిదున్ని పొలాన్ని సాగుకు సిద్ధం చేశారు. మంగళవారం వర్షం కురవడంతో విత్తులు విత్తే పనులకు శ్రీకారం చుట్టారు. దుకాణాలకు వద్దకు వెళ్లి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
ఆలస్యమైతే చీడ పీడలు : వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు పత్తి సాగు మొదలుపెట్టారు. జూన్ మొదటి వారంలో విత్తనాలు నాటితే దసరా పండగ సమయానికి పంట చేతికొస్తుందని చెబుతున్నారు. విత్తనాలు వేయడంలో ఆలస్యమైతే పంటకు అనేక చీడ పీడలు పట్టిపీడిస్తాయని దిగుబడి కూడా తగ్గుతుందని రైతులు తెలుపుతన్నారు. పత్తి పంట పూర్తవగానే మరల మొక్కజొన్న పంటకు భూమిని సిద్ధం చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ప్రధాన వాణిజ్య పంటగా పత్తి సాగు చేస్తున్నారు. ఆ తర్వాత వరి, మొక్కజొన్న సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులకు సమస్యల్లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
"గత కొన్ని రోజులుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం సాగుకు తయారు చేసుకుంటున్నాం. పొలం దుక్కులు దున్ని పెట్టుకున్నాం. నిన్నరాత్రి కురిసిన వర్షానికి విత్తనాలు వేస్తే మొలకలు మంచిగా వస్తాయి. అందుకే విత్తనాలు కొంటున్నాం. మరికొన్ని రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే దుక్కి నాశనం అవుతుంది. ఆలస్యం చేసినా పంట అనుకున్నంత మంచిగా రాదు." - రైతులు
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త : కాగా వానకాలం మొదలు కాగానే పత్తి రైతులు సాగుకు సిద్ధమవుతారు. అలాగే నకిలీ విత్తనాలు విక్రయించే అక్రమార్కులు కూడా రైతులను మోసం చేసి వాటిని విక్రయించాడానికి చూస్తుంటారు. అందుకే రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు.
"ఎండాకాలం అంతా పంటను రెండు మూడు సార్లు దుక్కుకున్నాం. వర్షం పడిన తెల్లారే పత్తి విత్తనాలు విత్తితే మొలకలు మంచిగా వస్తాయి. ఇంకొన్ని రోజులు అయితే వర్షాలు ఎక్కువ పడతాయి అప్పుడు ఇంకా విత్తనాలు విత్తినా ప్రయోజనం ఉండదు. కొన్ని విత్తనాలు మొలకొస్తాయి మరికొన్ని రావు అందుకే వర్షం పడ్డ మరుసటి రోజే విత్తనాలు వేస్తాం." - రైతులు
మార్కెట్ నిండా నకిలీ విత్తనాలు - రైతన్నా!! జర జాగ్రత్త - FAKE SEEDS SALES IN TELANGANA