Telangana fake Passport Case Update : నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీకి సహకరించిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. ఏఎస్ఐ లక్ష్మణ్ ప్రస్తుతం నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని నవిపేట్, మాక్లూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తదుపరి విచారణ కొరకు సీఐడీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు.
ఫేక్ సర్టిఫికేట్లతో విదేశీయులకు భారత పౌరుల పాస్‌పోర్టులు (Fake Passports) ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపిస్తున్న ముఠా గురించి తెలిసిన విషయమే. దీనిపై విచారణ ప్రారంభించిన సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో ఈ దందా జరిగినట్లు గుర్తించింది. నకిలీ సర్టిఫికెట్లతో పాస్‌పోర్టులను సృష్టించడం ద్వారా 92మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో అబ్దుల్ సత్తార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
నకిలీ పాస్‌పోర్టు కేసు - వారిని దేశం దాటనీయకుండా సీఐడీ నిఘా
Telangana Fake Passport Scam Update : విజిటింగ్ వీసాలతో థాయిలాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్‌నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్‌పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో తేలిందని చెప్పారు.
ఈ కేసులు విచారణ చేస్తున్న సీఐడీ అధికారులకు విస్తూపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నిరక్షరాస్యులతో పాటు పాఠశాలకు రాని పదోతరగతి విద్యార్థులకు నకిలీ పత్రాలు తయారుచేసి ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ వ్యవహారంలో అబ్దుస్ సత్తార్ కీలకంగా వ్యవహరించడంతో సీఐడీ అధికారులు అతడిని విచారించి కీలక వివరాలు రాబట్టారు. నకిలీ విద్యార్హత పత్రాలను సృష్టించడం వెనక ఇమ్మిగ్రేషన్ (Visa Immigration) చెక్‌నాట్ రిక్వయిర్డ్ కేటగిరీ పాస్‌పోర్టులు పొందే కుయుక్తులకు ముఠా పాల్పడినట్లు తేల్చారు.
భారత పౌరులుగా విదేశీయులకు పాస్‌పోర్టులు - ముఠా గుట్టురట్టు చేసి కటకటాల్లోకి
ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎవరి హస్తం ఉన్నదానిపై ఫోకస్ చేసిన పోలీసులు జిల్లాల వారిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందరికి పాస్‌పోర్టులు జారీ చేశారు. ఎంత మంది బయట దేశాలకు వెళ్లారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా ఎంతమంది విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశాలపై దృష్టి సారించారు.