DGP Jitender Respond On Battalion Police Protest : రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై డీజీపీ జితేందర్ తీవ్రంగా స్పందించారు. క్రమశిక్షణతో కూడిన ఫోర్సులో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని డీజీపీ పేర్కొన్నారు. సెలవులపై పాత పద్ధతి అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించమని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పండుగలు, సెలవుల సమయంలో కూడా పోలీసులు నిర్వహించే కఠినమైన విధులను దృష్టిలో ఉంచుకుని ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ ప్రయోజనం వర్తించదని టీజీఎస్పీ పోలీసులు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తున్నందున, ఈ సౌకర్యం మంజూరు చేసినట్టు డీజీపీ తెలిపారు.
ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి జీతాలు, అలవెన్సులు అధికంగా ఉన్నాయని.. పోలీసు శాఖ భద్రత, ఆరోగ్య భద్రత మొదలైన అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది విధుల్లో ధర్నా చేయడం సరికాదన్నారు. టీజీఎస్పీ ఒక యూనిఫాం, క్రమశిక్షణ గల దళమన్నారు. ఇటువంటి దళంలో పనిచేస్తూ బెటాలియన్ పోలీసులు ఆందోళనలు చేయడం ఎంతమాత్రం సబబు కాదని డీజీపీ జితేందర్ చెప్పారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ఒకే పోలీసు పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. నిన్నటి వరకు కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డెక్కగా నేడు డైరెక్ట్‌గా పోలీసులే ఆందోళనలకు దిగారు. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లు కమాండెంట్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుళ్ల ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించాలంటూ వారి కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై 'ఏక్ స్టేట్ ఏక్ పోలీస్' పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా, రాస్తారోకో ర్యాలీలను నిర్వహించారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాగా శుక్రవారం ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. అనంతరం వారు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించగా అరెస్టులకు దారితీసింది. ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం కల్పించాలి, కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు.
రోడ్డెక్కిన పోలీసుల భార్యలు - సచివాలయం ముట్టడికి యత్నం
నిన్నటివరకు కుటుంబసభ్యులే చేశారు - ఇవాళ బెటాలియన్ పోలీసులే రంగంలోకి దిగారు