CM To Inaugurate Gopanpally Flyover : హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్‌పల్లితండా పైవంతెన ఎట్టకేలకు వాహనదారులకు అందుబాటులోకి రాబోతుంది. ఐటీ కారిడార్‌తోపాటు గోపన్‌పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల గేటెడ్ కమ్యునిటీల మధ్య వారధిగా నిలిచే ఈ వంతెనను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో స్థానికులు, ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.
సుమారు రూ.28.5 కోట్ల వ్యయంతో : గత ప్రభుత్వ హాయాంలో సుమారు 28.5 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు భవనాల శాఖ, పీవీరావ్ నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. 'వై' ఆకారంలో ఒక వైపు వెళ్లేందుకు మాత్రమే వీలుండే విధంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. గోపన్‌పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్లో కలిసే రేడియల్ రోడ్డుపై తండా జంక్షన్ వద్ద ఈ బ్రిడ్జిను నిర్మించారు. గౌలిదొడ్డి వైపు నుంచి నల్లగండ్ల వైపునకు వెళ్లేందుకు 430 మీటర్లు, తెల్లాపూర్ వైపునకు 550 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెనను పూర్తి చేశారు. 243 మెట్రిక్ టన్నుల స్టీల్, 806 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించి 84.4 మీటర్ల సింగిల్ స్పాన్‌తో వంతెన నిర్మించారు.
తీరనున్న ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు : నల్లగండ్ల, తెల్లాపూర్ ప్రాంతాల్లో భారీగా గేటెడ్ కమ్యునిటీలు నిర్మాణాన్ని సంతరించుకున్నాయి. లక్షల మంది ఐటీ తదితర ఉద్యోగులు ఇక్కడ నివాసముంటున్నారు. వేల సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు నానక్‌రాంగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్లకు గోపనపల్లి తండా కూడలి మీదుగా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ఒక్కసారిగా నలువైపుల నుంచి వచ్చే వాహనాలతో కూడలిలో ట్రాఫిక్ స్తంభించిపోతుండేది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ సమస్య ఐటీ ఉద్యోగులను తీవ్రంగా వేధించేది. సమయానికి కార్యాలయాలకు వెళ్లలేక ఇబ్బందిపడేవారు. పాఠశాల విద్యార్థులు కూడా సతమతమయ్యేవారు.
ఎట్టకేలకు అందుబాటులోకి రానున్న వంతెన : ఈ సమస్యపై స్థానికుల ఆందోళనతో స్పందించిన గత ప్రభుత్వం గోపన్‌పల్లితండా జంక్షన్ వద్ద పైవంతెన నిర్మాణం చేపట్టింది. 2020లో నిర్మాణ పనులు మొదలుపెట్టగా కరోనా కారణంగా అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ పీవీరావ్ నిర్మాణ సంస్థ యుద్దప్రాతిపదిన పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడం వంతెన ప్రారంభానికి ఆటంకం కలిగింది. ఈలోగా ప్రభుత్వాలు మారడంతో వంతెన ప్రారంభోత్సవం ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ వంతెన అందుబాటులోకి రాబోతుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం : ఈ వంతెనపై ఇటీవల 'ఎక్స్‌లో' ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల గోపన్ పల్లితండా కూడలి సైతం బాగా విస్తరించింది. నలువైపులా 2 ఎకరాల మేర విస్తరించిన ఈ ప్రాంతంలో విశాలమైన కూడలిగా ఈ జంక్షన్ నిలువనుంది.
అటు తెల్లాపూర్, ఇటు నల్లగండ్ల వైపు రెండుగా చీలిపోయే ఈ కూడలి ప్రదేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరోవైపు వంతెన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లైఓవర్ పైభాగం, కింది భాగాన్ని పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. వంతెనపై రాత్రిపూట మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
70 రోజుల్లో రెండోసారి కూలిన వంతెన - బిహార్‌లో అనుకుంటే పొరపాటే! - ODED BRIDGE COLLAPSED AGAINభారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన - ఆసిఫాబాద్ జిల్లాలో 54 గ్రామాలకు నిలిచిన రాకపోకలు - Peddagu flowing fast Kagaj Nagar