CEO Vikas Raj on Lok Sabha Election Nominations Process : నేడు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలి రోజు పలువురు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
Vikas Raj on Parliament Elections 2024 : ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేయవచ్చని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే వాటిని ఈ నెల 24లోగా ప్రింట్ తీసుకుని సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపాలన్నారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలు ఇవ్వొచ్చన్న ఆయన, వాటితో పాటు 5 ఫొటోలు ఇవ్వాలని చెప్పారు.
తొలిరోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ - నామపత్రాలు దాఖలు చేసిన ఈటల, డీకే అరుణ, రఘునందన్‌రావు
అభ్యర్థులు ఇచ్చే ఫొటోలు స్పష్టంగా ఉండాలని, టోపీలు, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్న ఫొటోలు ఇవ్వకూడదని వికాస్‌రాజ్ తెలిపారు. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో అభ్యర్థులు సంతకం చేయాలని సూచించారు. ప్రతి కాలమ్ నింపాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్న ఆయన, రాష్ట్రంలో ఎక్కడైనా అకౌంట్ తెరవొచ్చని, ఎన్నికల ఖర్చులన్నీ ఆ బ్యాంకు ఖాతా ద్వారానే జరపాలని స్పష్టం చేశారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేయవచ్చు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపాలి. నామినేషన్‌తో పాటు 5 ఫొటోలు ఇవ్వాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకుని దిగిన ఫొటోలు ఇవ్వొద్దు. కనీసం 2 నెలల ముందు దిగిన ఫొటోలు మాత్రమే అందజేయాలి. ముఖం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలి. ప్రతి కాలమ్ నింపాలి. - వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు తొలి రోజు నామపత్రాలు దాఖలు చేశారు.
వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇవ్వండి - ఈసీని కోరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్