Women Power in NDA : తేజస్వి పొడపాటి, గాయత్రి సందిరెడ్డి, ఉండవల్లి అనూష, రాయపాటి అరుణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సాగించిన అరాచకాలను ఎండగట్టడంలో వీళ్లు అసలు సిసలైన నారీమణులు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, పార్టీ వాయిస్‌ను వినిపించడంలో ఫైర్ బ్రాండ్స్. ప్రశ్నిస్తే పోలీసు, సీఐడీ కేసులతో జగన్ ప్రభుత్వం భయపెడుతుందని తెలిసినా బెదరకుండా తమ వాయిస్‌ను నిక్కచ్చిగా వినిపిస్తున్నారు. ట్రోల్స్‌తో వేధింపులకు దిగే వైఎస్సార్సీపీ సోషల్ మీడియాను ఏమాత్రం ఖాతరు చేయకుండా, ధైర్యంగా ఎదుర్కొంటున్న రాజకీయ రుద్రమదేవిల్లా గుర్తింపు పొందారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయడం, చర్చా కార్యక్రమాల్లో పాల్గొని ధైర్యంగా మాట్లాడటం, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ రకంగా ఎన్‌డీఏకు వీళ్లు అనధికార స్టార్ క్యాంపెయినర్లు. వీరి పోస్టులు, చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించిన అంశాలు ఎందరినో ఆలోచింపజేస్తుంటాయి. అధికారపార్టీ నేతలకు గుబులు పుట్టిస్తుంటాయి.
తేజస్వి కౌంటరిస్తే అధికార పార్టీకి మంట ఖాయం: తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం అధ్యక్షురాలైన తేజస్వి పొడపాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై మాటల తూటాలతో విరుచుకుపడుతూ ఔరా అనిపిస్తారు. భూమి ఫౌండేషన్ నిర్వహించే ఈమె జగన్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాలపై తనదైనశైలిలో ప్రతి సభలోనూ ఛలోక్తులు, ప్రాసలతో నిలదీస్తారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులతో కలిసి వివిధ రూపాల్లో హైదరాబాద్‌లో నిరసనలు తెలపడంలో ముఖ్య భూమిక పోషించారు. ధర్నాలు, క్యాండిల్ ర్యాలీలు, లెట్స్ మెట్రో, చలో రాజమహేంద్రవరం వంటి కార్యక్రమాలు, గచ్చిబౌలి స్టేడియంలో ‘సీబీఎన్ గ్రాటిట్యూట్’ పేరిట భారీ సభ నిర్వహించారు. ఎన్‌డీఏ అభ్యర్థులకు మద్దతుగా ‘'మేము సైతం మన రాష్ట్రం కోసం’' అంటూ ఐటీ ఉద్యోగులతో కలిసి ప్రతి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘ఇన్ని చదువుల విప్లవాలు కనిపిస్తుంటే చంద్రబాబు కడుపు మండదా అంటూ’ సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ఓ సభలో వ్యాఖ్యానించగా దీనికి తేజస్వి ఓ సమావేశంలో దీటైన కౌంటర్ ఇచ్చారు. 'అన్నంపెట్టే అన్న క్యాంటీన్ మూసేస్తే మండదా' అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీశారు. ‘'నూకలిచ్చి వండుకొని ఒక్కపూటలో అరిగిపోయాక మళ్లీ చేయిచాచేలా చేసే మనస్తత్వం చంద్రబాబుది కాదు. ఒక వ్యక్తిని చదివించి, ఉద్యోగం ఇప్పిస్తే ఓ కుటుంబం పూర్తిగా పేదరికం నుంచి బయటపడేలా భవిష్యత్ ఆలోచనలే ఆయన మదిలో నిరంతరం ఉంటాయి’' అంటూ మరో సమావేశంలో పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె ఎన్నికల ప్రచారం
గాయత్రి మాటలు తూటాలే: సీఎం జగన్, పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై విజయవాడకు చెందిన తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి సందిరెడ్డి మాటల తుటాలతో నిలదీస్తారు. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై అధికారపార్టీ నాయకులు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతుంటారు. పవన్‌కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలుస్తానని చెప్పినప్పటి నుంచి ఆయనపై వైఎస్సార్సీపీ చేసిన ట్రోలింగ్స్‌పై అదేస్థాయిలో బదులిచ్చారు. ప్రతి అంశంపై వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపిస్తుంటారు.
జగన్‌కు గులకరాయి తగిలి గాయమైందని, ఇది హత్యాయత్నమంటూ సాక్షి పత్రికలో రాయడంపై గాయత్రి తనదైన శైలిలో వీడియో పోస్ట్‌చేశారు.'అసలు హత్యాయత్నానికి ఎలాంటి ఆయుధాలు వాడుతారో అవినాష్‌రెడ్డిని అడిగితే చెబుతారు. సీబీఐ ఛార్జిషీట్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. వివేకం సినిమాలో క్లియర్‌గా ఉంది. దానిని ఓసారి చూడండి' అంటూ కడిగిపారేశారు.
వై.ఎస్.షర్మిల పసుపు రంగు చీర కట్టుకున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ‘'సీఎం హోదాలో ఉండి, సొంత చెల్లి చీరపై రాజకీయం చేశారు. సీఎం పదవి కాపాడుకోవడం కోసం ఇంతలా దిగజారిపోతారా?' అంటూ విరుచుకుపడ్డారు.
పోస్టులతో కడిగిపారేసే అనూష: సామాన్య మహిళ అయిన ఉండవల్లి అనూష వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరుపై సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయిదేళ్లుగా ఐ-టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నేతల తీరును, ప్రభుత్వ విధానాలను కడిగిపారేస్తున్నారు. ఈమెను వైకాపా సోషల్ మీడియా పెద్దఎత్తున ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ అనూష వీటికి బెదిరిపోకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. అనూషపై వైఎస్సార్సీపీ నేతలు 4 కేసులు పెట్టారు. ఒకటి ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. అయినా అధికార పార్టీ అరాచకాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేయడంపై స్పందిస్తూ 'మిమ్మల్ని ఏదో అన్నారని మీ కార్యకర్తలు దాడిచేశారు. మీరు నారా భువనేశ్వరిని ఎన్నో అన్నారు. అందుకు టీడీపీ వాళ్లు ఏం చేయాలి? టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీకి చక్రవడ్డీ కలిపి ఇవ్వనున్నాం' అని హెచ్చరించారు.‘అరగంట, గంట ఆడియోలు బయటకు వచ్చాక మీరు వాటిని సమర్థించుకునేలా ఎలా మాట్లాడుతున్నారు నాయనా’ అంటూ మంత్రి అంబటిపై ఓసారి సెటైర్లతో వీడియోపెట్టారు.
నెల్లూరులో సామాజిక మాధ్యమ కార్యకర్తపై దుండగుల దాడి
బాణాల్లా దూసుకెళ్లే అరుణ ప్రసంగాలు: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఏ సభలో ప్రసంగించినా, ఏ చర్చా కార్యక్రమంలో మాట్లాడినా అందరిని ఆలోచింపజేస్తారు. పవన్‌కల్యాణ్ అవిశ్రాంతంగా పోరాడుతున్న తీరు, ఆ పార్టీని నడుపుతున్న వైనం, ఎన్‌డీఏను అధికారంలోకి ఎందుకు తెచ్చుకోవాలి? వంటి అంశాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లేలా మాట్లాడతారు. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సమర్థంగా తిప్పికొడుతుంటారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా, చమత్కారం జోడిస్తూ విమర్శలు చేస్తుంటారు.
‘పదిమంది ఒక్కటై జగన్‌పైకి ఎందుకు వస్తున్నారు?’ అని ఓ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మద్దతుదారు ప్రశ్నించగా ఓ సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మంచి వాళ్లంతా ఒక్కటి కావాలని, పిచ్చోడిని ఏ ఒక్కరో నియంత్రించలేరు కదా? పది మంది కలిస్తేనే ఆపగలరు’ అని బదులిచ్చారు. చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?’ అని వైకాపా సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యానిస్తే ‘చొక్కా ఒక్కటే కాదు. ప్యాంటు, చెడ్డీ, బనియన్ కూడా మడత పెట్టి సూట్‌కేస్‌లో సర్దుకొని సిద్ధంగా ఉండండి. ఎన్నికల తర్వాత చర్లపల్లి జైలులో ఉపయోగపడతాయి’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి అనుచరులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి.. పవన్ కల్యాణ్ వార్నింగ్