Teacher lost 29 lakhs by Cyber Fraud : సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గంలో రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబుడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలి నుంచి రూ.29 లక్షల 10 వేలు కాజేశారు. మొబైల్ ఫోన్‌కు వచ్చిన లింక్‌ను బాధితురాలు క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఆమెను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసి యాప్ డౌన్లోడ్ చేయించారు. అనంతరం ట్రేడింగ్ యాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను డౌన్లోడ్ చేయించి, దాని ద్వారా ట్రేడింగ్ చేయొచ్చని నమ్మించారు.
లింక్స్ క్లిక్ చేయొద్దు : నేరగాళ్లు తెలిపిన యాప్ ద్వారా నగదు వారి ఖాతాల్లో బాధితురాలు జమ చేసింది. అనంతరం స్పందిచకపోవడం, యాప్ కూడా మాయమైపోవడంతో మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు, సందేశాల ద్వారా వచ్చే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్ లింకులను క్లిక్ చేసి వాటిని నమ్మొద్దని పోలీసులు సూచించారు.
Cyber Fraud By KYC Update : మరో కేసులో యాక్సిస్ బ్యాంకు కేవైసీ(Know Your Customer) అప్డేట్ పేరుతో మహిళ నుంచి రూ. 1 లక్ష 19 వేలు కాజేశారు. నేరగాళ్లు చెప్పిన లింకు ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు తెలిపిన బాధితురాలు ఓటీపీని సైతం ఎంటర్ చేసింది. దీంతో ఖాతాలోని నగదు డెబిట్ అవ్వడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Police Arrested Two Cyber Criminals From Kerala : ఇదికాగా మరోవైపు ఈ నెల 13న పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిరువురు కలిసి దేశవ్యాప్తంగా రూ.20 కోట్లు కాజేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. కేరళకు చెందిన ఇద్దరు సైబర్ నేరస్థులు, కాజేసిన సొమ్మును క్రిప్టో రూపంలో మర్చి చైనాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. మోసపూరిత మాటలు చెప్పి అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారని, గుర్తు తెలియని ఖాతాల్లో పెట్టుబడులు పెట్టి ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచించారు.