TDP MLAs Reach To Chandrababu House: మంత్రివర్గ కూర్పుపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. తమ అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలంతా మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు.
మంత్రివర్గం లో చోటు కోసం ఆశావహులు అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. మంత్రివర్గ కూర్పుపై తన నివాసంలో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నందున, అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడి ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు రేపు చంద్రబాబు ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి గా చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని భాజపా ఎమ్మెల్యేలు బలపరచునున్నట్లు సమాచారం.
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 9:30గంటలకు తెలుగుదేశం-జనసేన-భాజపాకూటమి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు చంద్రబాబు ని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ని ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూటమి తరపున గవర్నర్ కు పంపనున్నారు. తీర్మానం అందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ తెలుగుదేశం కూటమికి ఆహ్వానం పంపనున్నారు. 12వ తేదీ ఉదయం 11:27గంటలకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. పక్కనే జాతీయ రహదారికి తోడు సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, విజయవాడ నుంచి రాకపోకలకు సౌలభ్యంగా ఉండటంతో కేసరపల్లిని ఈ మెగా ఈవెంట్ కు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ఇరువైపులా భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. వేలాదిమంది కార్మికులు రాత్రి, పగలు తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. ఆహ్వానితులకు పాసులు కేటాయించనున్నారు. ఇవన్నీ జీఏడీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని వేసింది.