TDP Leader Chandrababu Election Campaign: సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాంధ్రను దోచుకోవడం తప్పితే ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చెత్త పన్నును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, సభాపతి తమ్మినేనిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు.
ప్రజాగళం సభల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏంటో అర్థమవుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలన్నారు. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోందని ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదన్నారు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టనని చంద్రబాబు అన్నారు. రూ.10 ఇచ్చి వంద రూపాయలు దోచుకునే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.
రైతులకు కరెెంటు ఉత్పత్తి చేసే సోలార్ మార్గానికి శ్రీకారం చుడతాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తాం. చదువు చెప్పవలసిన ఉపాధ్యాయుడిని మద్యం షాపు దగ్గర కాపలా పెట్టాడు. ఐదు సంవత్సరాలుగా సీఎం జగన్ మిమ్మల్ని చిత్ర హింసలు పెట్టాడు. వందల కోట్లు దోచేసుకుని చెల్లెలకు అప్పు ఇచ్చిన దుర్మార్గుడు ఈ జగన్. అలాంటి అన్న మనకు మళ్లీ వద్దు. - చంద్రబాబు, టీడీపీ అధినేత
మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించింది టీడీపీ - చంద్రబాబు - Chandrababu Interact with Women
తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఆడబిడ్డల భవిష్యత్తు కోసమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వంశధారా, నాగావళితోపాటు వంశధార ఫేస్-2 పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తానన్నారు. ఆమదాలవలస నుంచి వలసలు వెళ్లకుండా చూస్తామని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని కూటమి అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు.
గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైసీపీ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని దిల్లీ వెళ్లి బొటనవేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. చిరంజీవి, రాజమౌళి లాంటి వారిని కూడా జగన్ అవమానించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక విధ్వంసకారి. రూ.13లక్షల కోట్లు అప్పు చేశారని నిప్పులు చెరిగారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం, అప్పులు ఎక్కువ ఉన్న రైతులు ఏపీలోనే ఉన్నారని చంద్రబాబు అన్నారు. మేం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పించి పంటల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీటిని అందించి వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తామని పేర్కొన్నారు.
జగన్ అహంకారి - విధ్వంసం, వినాశనమే తప్ప అభివృద్ధి చేతకాదు : చంద్రబాబు