TDP Leaders Issue in Pulivendula : వైఎస్సార్ జిల్లా పులివెందులలో టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. రేషన్ దుకాణం కోసం పరీక్ష రాయడానికి వచ్చిన వ్యక్తిని బీటెక్ రవి అనుచరులు చితకబాదారు. పులివెందుల నియోజకవర్గంలోని 79 రేషన్ దుకాణాలకు సంబంధించి పరీక్ష రాసేందుకు 104 మందికి హాల్ టికెట్లు అందజేశారు. వీరిలో MLC రాంగోపాల్‌రెడ్డికి అనుచరుడైన వేంపల్లికి చెందిన ప్రకాశ్ కూడా ఉన్నారు. పులివెందులలోని అహోబిలం పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న ప్రకాశ్‌ను బీటెక్ రవి అనుచరులు తీసుకెళ్లి చితకబాదారు. పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారు.
విషయం తెలిసిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి భార్య ఉమాదేవి ప్రకాశ్‌ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. ప్రకాశ్‌ను వదిలిపెట్టే వరకూ పరీక్ష జరగనివ్వబోమని రాంగోపాల్‌రెడ్డి భార్య, అనుచరులు పాఠశాల వద్ద బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని బీటెక్ రవి అనుచరుల చెర నుంచి ప్రకాశ్‌ను విడిపించారు. రెండురోజుల వ్యవధిలో బీటెక్ రవి అనుచరులు రెండుసార్లు బీభత్సం సృష్టించారు. గురువారం నాడు పులివెందుల నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలోనూ బీటెక్ రవి అనుచరులు రెచ్చిపోయారు.
'ఆ తర్వాత మీ కథ ఉంటుంది' - పులివెందుల డీఎస్పీకి వైఎస్ జగన్ వార్నింగ్
జనసేనతోపాటు టీడీపీ నాయకులనూ టెండర్లు వేయనీయకుండా అడ్డుకొని దాడికి దిగారు. పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి, రాంగోపాల్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని దుకాణాలూ తమవారికే దక్కాలన్న ఉద్దేశంతోనే బీటెక్ రవి అనుచరులు ఇలా దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత వర్గపోరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీఎం చంద్రబాబు శనివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరులో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న వేళ బీటెక్ రవి అనుచరులు దాడులకు పాల్పడడం చర్చనీయాంశమైంది. వరుసగా రెండ్రోజుల పాటు జరిగిన ఘటనలను నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేశాయి. శనివారం సీఎం జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నెల రోజుల తర్వాత బయటకు - పులివెందులలో ప్రత్యక్షమైన అవినాష్ పీఏ రాఘవరెడ్డి
బంధువుల ఇళ్లకు వైఎస్ జగన్ - రహస్య మంతనాలు - పులివెందులలో ఏం జరుగుతోంది?