TDP Complaint on Set Fire to Documents: సిట్ కార్యాలయంలో హెరిటేజ్ సహా వివిధ కేసుల దర్యాప్తునకు సంబంధించిన పత్రాలు తగులబెట్టటంపై అనుమానం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. సీఐడీలోని ఆర్ధికనేరాల విభాగం ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో హెరిటేజ్ సహా వివిధ కేసుల దర్యాప్తు పత్రాలు తగుల బెట్టించారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేయించాలని కోరుతూ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్లరామయ్య ఈసీకి విజ్ఞాపన పత్రం అందించారు.
చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి ఇప్పుడు ఆ వ్యవహారం బయటపడుతుందని కేసు పత్రాలు తగల బెడుతున్నారని వర్లరామయ్య ఆరోపించారు. సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో పత్రాలు కాల్చివేత జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో సీఐడీ ఇలా వ్యవహరిస్తుందా అంటూ ధ్వజమెత్తారు. సీఐడీ తీరుపై ప్రజలంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారన్న వర్ల రామయ్య, ప్రభుత్వం మారేముందు తెలంగాణలోనూ కీలక పత్రాలు అదృశ్యం అయ్యాయని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్రింటర్లో ఇంకు అయిపోయింది అంటూ పనికిమాలిన కారణాలను రఘురామిరెడ్డి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు జరిగే సమయంలో సీఐడీ ఇలా వ్యవహరిస్తుందా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఏ ఫైలూ కార్యాలయం బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించాల్సిందిగా ఈసీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణాలోనూ ప్రభుత్వం మారే ముందు సచివాలయం నుంచి కీలక పత్రాలు అదృశ్యం అయ్యాయని, సీఐడీ కార్యాలయంలో కేసు దర్యాప్తు పత్రాలు తగులబెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. రాష్ట్ర సచివాలయంలోనూ వైసీపీ దొంగలు ఫైళ్లు తగులబెట్టే ప్రమాదముందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సీఈఓను కోరినట్టు తెలిపారు.
TDP Pattabhi Fires on CID: దస్త్రాల దహనంపై సీఐడీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. ఒక తప్పును కప్పిపుచ్చేందుకు సీఐడీ వంద తప్పులు చేస్తోందన్న పట్టాభి, జిరాక్స్ మిషన్‌లో ఇరుక్కుపోవడం, ఫేడ్ కాగితాలు అనడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయి, వాటికే ఇంక్ లేకుండా ఫేడ్ అయ్యాయా అంటూ నిలదీశారు. సీఐడీ వివరణతో అనుమానాలు మరింత బలపడ్డాయన్న పట్టాభి, కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాలుస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారని, టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలనూ కాల్చేస్తున్నారని విమర్శించారు.
ఎంతో నమ్మకంతో ఇస్తే దహనం చేస్తారా ? - పత్రాల భద్రతపై హెరిటేజ్ ఆందోళన - HERITAGE DOCUMENTS BURNING