TDP Candidates Pending List : రాష్ట్రంలో ఎన్డీఏ పక్షాల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. మిత్రపక్షాలైన బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. 2 జాబితాల్లో కలిపి తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించగా బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి. గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఇంతకుముందే తెలుగుదేశం ప్రకటించింది.
తాజాగా బీజేపీ ప్రకటించిన 10 అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తిలో శివరామకృష్ణ రాజు పేర్లు ఖరారు చేసింది. జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పి.గన్నవరం స్థానాన్ని గిడ్డి సత్యనారాయణకు ఇచ్చింది. వీటితో తెలుగుదేశం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
విజయనగరం పార్లమెంట్‌తో పాటు చీపురుపల్లి, భీమిలి అసెంబ్లీ స్థానాల్లో ఎవర్ని ఎక్కడ నియమించాలన్న పీటముడి వీడలేదు. విజయనగరం లోక్‌సభ సీటు తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ నేత కళా వెంకట్రావు గానీ, మీసాల గీత, బంగార్రాజు, కిమిడి నాగార్జునలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డా లేక ఆయన తనయుడు రాఘవరెడ్డా అనే సందిగ్ధత కొనసాగుతోంది.
సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. కడప పార్లమెంట్ రేసులో రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, జమ్మలమడుగు ఇన్‌ఛార్జి భూపేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం ఎంపీ స్థానానికి జేసీ పవన్ రెడ్డితో పాటు పోల నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో పాడేరుకు ఇన్‌ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పిస్తారా లేక అరకు అభ్యర్థిగా ప్రకటించగా అవకాశం కోల్పోయిన దొన్నుదొరను సీటు ఇస్తారా అన్నది వేచి చూడాలి.
చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అన్న సందిగ్ధత వీడలేదు. చీపురుపల్లిలో గంటా పోటీ చేయకుంటే సీనియర్ నేత కళా వెంకట్రావ్ లేదా కిమిడి నాగార్జునలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే భీమిలి స్థానానికి కళా వెంకట్రావ్ లేదా నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జి బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి అసెంబ్లీ స్థానానికి సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, గొట్టిపాటి నరసయ్య కుమార్తె శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. వైసీపీలో ఉన్న ఓ మాజీ మంత్రి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి వస్తే వారికీ అవకాశం దక్కవచ్చు.
రాయలసీమలో రాజంపేట అసెంబ్లీ స్థానానికి జగన్మోహన్ రాజు, చంగాలరాయుడు మధ్య పోటీ నెలకొంది. ఆలూరు స్థానానికి వైకుంఠం కుటుంబ సభ్యుల్లో ఒకరికి లేదా బీసి సామాజికవర్గం నుంచి వీరభద్రగౌడ్ పేరు పరిశీలనలో ఉంది. అనంతపురం అసెంబ్లీ స్థానానికి ప్రవాసాంధ్రురాలు నిర్మల, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య పోటీ ఉంది. గుంతకల్లులో మాజీమంత్రి గుమ్మనూరు జయరాం పేరును పార్టీ పరిశీలిస్తుండగా స్థానిక పరిస్థితులను సర్దుబాటు చేయాల్సి ఉంది. అలాగే ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది.