TDP Activist Committed Suicide: వైఎస్సార్సీపీ నేతల వేధింపులతో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలంలో చోటు చేసుకుంది. తాను ఎందుకు చనిపోతున్నానో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యకు సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తకు పార్టీ అంటే ఎనలేని అభిమానం. వైఎస్సార్సీపీ వాళ్ల వేధింపులతో సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చీరాల మండలం కావూరిపాలెంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే కావూరిపాలెం గ్రామంలో ఉన్న బొగ్గులవారిపాలెంలో కోట వెంకటేశ్వరరెడ్డి (50) అలియాస్ బుజ్జిరెడ్డి ఇంటిముందు ఉన్న పందిరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన టీడీపీ నాయకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈనెల ఒకటో తేది ఉదయం మంగళగిరిలోని మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో వైఎస్సార్సీపీ నాయకుల వలన తాను పడుతున్న ఇబ్బందులను విన్నవించేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంతో తన కుమారుడు సమరసింహారెడ్డికి ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకు వెళ్లి పురుగుల మందు తాగారు. విషయం తెలియడంతో వెంటనే అతడ్ని విజయవాడలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు.
అక్కడ రెండు వారాలు వైద్యశాలలో ఉండి, వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. అయినా ప్రతిపక్ష నాయకులు సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బుజ్జిరెడ్డి తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వచ్చి తన ఇంటి ముందు ఉన్న పందిరికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భార్య నాగలక్ష్మి, కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాసి తన జేబులో పెట్టుకున్నాడు. మృతదేహాన్ని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ప్రేయసిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!
సూసైడ్ నోట్లో ఇలా ఉంది: "చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యకు కోట వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి నమస్కరించి రాస్తున్నది. అయ్యా, నేను 32 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసే వాడిని. పార్టీ కార్యక్రమాలకు బహిరంగ సభలకు జనాన్ని బాగా తీసుకుని వెళ్లేవాడిని. నేను వ్యాపారం చేస్తూ, డబ్బులు బాగా ఖర్చు పెట్టేవాడిని. నేను ఈ ఊర్లో 1999లో స్కూల్, రోడ్డు నిర్మాణాలు చేయించాను. నాకు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి. నేను నా భార్య పిల్లలను సరిగా పట్టించుకోకుండా పార్టీలో తిరిగే వాడిని. తాజాగా వినాయక చవితికి మా ఊర్లో జగన్ పాటలు వేసి, చంద్రబాబును కించపరిచే పాటలు పెట్టారు. ఇలాంటి పాటలు వేయవద్దని, ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అని, వారి మీద అలాంటి పాటలు వేయవద్దని, దేవుడు పాటలు వేయమన్నాను.
అందుకు నామీద కక్షగట్టిన వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లు, నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నేను దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. మా దుకాణానికి ఎవరైనా వచ్చినా, మా కుటుంబంతో మాట్లాడినా రూ.50 వేలు జరిమానా విధిస్తామని వైఎస్సార్సీపీ వాళ్లు చెప్పారు. కుంచాల పొట్టయ్య, కుంచాల చిన్న (పండు అంకిరెడ్డి), కావూరి ఎర్ర శ్రీనివాసరెడ్డిలు జనాన్ని పిలిచి మరీ మా ఇంటికి ఎవరు వెళ్లినా, మాట్లాడినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నా మరణానికి ఆ ముగ్గురే కారణం.
వారి కారణంగా నేను, నా కుటుంబం 40 రోజులు నుంచి నరకం అనుభవించాం. దయచేసి వారిని వదిలిపెట్టొద్దు. తగిన శిక్ష వేయాలి. నా కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.20 లక్షలు, నా కుమారుడికి పోలీస్ హోంగార్డు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి, మంత్రి నారా లోకేశ్‌కు చెప్పి నా కుటుంబానికి న్యాయం చేయాలి. నేను మా ఊరిలో అన్ని ఇళ్ల వారికి సాయం చేశాను. కానీ ఈ ముగ్గురి వలన ఇలా చేశాను. నా కుటుంబానికి టీడీపీ వాళ్లు అండగా ఉండాలి".
ప్రేమ పేరుతో బాలుడి వేధింపులు - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య