Swachh Challapalli Initiative : స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా నిలుస్తోంది కృష్ణా జిల్లా చల్లపల్లి! పదేళ్ల క్రితం మొదలైన స్వచ్ఛ సంకల్పం గ్రామ రూపురేఖల్నే మార్చేసింది. బహిరంగ మలవిసర్జన రహితంగా నిలిచింది. రహదారులు బాగుపడ్డాయి. మురికికూపాలుగా ఉన్న ప్రాంతాలు పార్కులుగా మారాయి. డంపింగ్ యార్డు, శ్మశానం సందర్శన స్థలాలుగా తయారయ్యాయి. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగింది. వైద్య దంపతుల ఆలోచనతో మొదలైన మిషన్ స్వచ్ఛ చల్లపల్లి ఈ నెల 12వ తేదీతో పదేళ్లు పూర్తిచేసుకోబోతోంది.
కృష్ణా జిల్లా చల్లపల్లి 25 వేల మందికిపైగా జనాభాతో దివిసీమకు ముఖద్వారంగా ఉంది. పదేళ్ల క్రితం బహిరంగ మలవిసర్జన, రోడ్లపై చెత్తాచెదారం, మురుగుతో అధ్వానంగా ఉండేది. గంగులవారిపాలెం రహదారిలో బహిరంగ మలవిసర్జనను అరికట్టడానికి, డాక్టర్ DRK ప్రసాద్, పద్మావతి దంపతులు సహా మరికొందరు ఓ రకంగా సత్యాగ్రహ దీక్ష చేశారు. తెల్లవారుజామున మూడున్నర నుంచే వీధిలో కాపలా కాస్తూ బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే నష్టాలను వివరించారు.
నేటికీ కొనసాగుతోన్న కార్యక్రమం: కొందరి నుంచి ప్రతిఘటన ఎదురైనా ఓపిగ్గా నచ్చజెప్పారు. ఓ 3 నెలల తర్వాత సత్ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా ఏడాది పాటు గ్రామంలో స్వచ్ఛత కోసం పనిచేస్తామని డాక్టర్ ప్రసాద్ మాటిచ్చారు. ఆ మేరకు 2014 నవంబర్ 12వ తేదీన మరో 15 మందితో కలిసి వీధులు శుభ్రం చేయడం ప్రారంభించారు. ఆ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది.
గ్రామస్థుల సంకల్పం.. 15 రోజుల్లోనే ప్లాస్టిక్‌కు చెక్.. ఒకే ఒక్క నినాదంతో..
వైద్య దంపతుల సంకల్పానికి గ్రామస్థుల సహకారం: స్వచ్ఛతా ఉద్యమానికి గ్రామస్థుల సహకారం మరింత ఉత్సాహాన్నిచ్చింది. అనేక మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛ కార్యకర్తల్లా మారారు. రోజులో ఓ గంటన్నర పాటు సమయాన్ని ఊరిబాగు కోసం కేటాయిస్తున్నారు. ఉద్యోగులు, గృహిణులు, విశ్రాంత ఉద్యోగులూ ఇలా అన్నివర్గాలవారూ రోజూ తమ వంతుగా సేవలందిస్తున్నారు.స్వచ్ఛతతోపాటు సుందరీకరణకు ప్రాధాన్యమిస్తూ ఒకప్పుడు మురికితో నిండిన ప్రదేశాల్ని పార్కులుగా తీర్చిదిద్దారు. గ్రామంలో కూడళ్లు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఈ పదేళ్లలో పెరిగి పెద్దవయ్యాయి. 100 శాతం ఓడీఎఫ్ (Open Defecation Free) గ్రామంగా చల్లపల్లి మారడంలో వైద్య దంపతులతోపాటు గ్రామస్థుల కృషి కూడా ఉంది.
తెల్లవారుజామున నాలుగున్నర నుంచే స్వచ్ఛ కార్యకర్తలు డ్రెయిన్లలో పూడిక తీయడం, చెత్త ఊడ్చటం, పొదల్ని తొలగించడం, వంటి పనులు చేస్తారు. డంపింగ్ యార్డు, శ్మశానాన్ని బాగుచేయడానికి మొదట్లో రెండు నెలలు పనిచేశారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు వీలుగా 'మన కోసం మన ట్రస్టు'ను వైద్య దంపతులు నెలకొల్పారు. ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి ఈ ఉద్యమానికి తన వంతు సాయంగా టాటా ఏస్ వాహనాన్ని సమకూర్చారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌రెడ్డి గ్రామంలోని శ్మశానవాటిక అభివృద్ధికి 8 లక్షలు అందజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలుపురు ప్రముఖులు ఈ గ్రామాన్ని సందర్శించి వీళ్ల స్వచ్ఛ సంకల్పాన్ని ప్రశంసించారు.
"మేము మొదటు బహిరంగ మలవిసర్జనను అరికట్టాలని స్టార్ట్ చేశాము. మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అనుకోకుండా మూడు నెలల్లోనే మంచి ఫలితాలను ఇచ్చింది. అలా శుభ్రతతో పాటు సుందరీకరణపై కూడా దృష్టి పెట్టాము. ప్రతి రోజూ ఒక ముఖ్యమైన కార్యక్రమాలు చేశాము". - పద్మావతి, వైద్యురాలు
'పదేళ్లలో ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్- దేశ శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం' - Swachh Bharat Mission