Supreme Court on Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఐదున మొదలయ్యే వారంలో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణలో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఆ మేరకు సీబీఐ కోర్టు కొత్త జడ్జికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ దశలో స్పందించిన కోర్టు ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని ఐదు, పది నిమిషాల్లో నిర్ణయం తీసుకునేది కాదని వ్యాఖ్యానిస్తూ ఆగస్టుకు వాయిదా వేసింది. డిశ్చార్జి పిటిషన్లపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున వాటిని ట్రయల్‌కోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది.