Supreme Court Denies Interim Bail to MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో ఐదు నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్న కోర్టు, దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. కేసును వెంటనే విచారణ చేపట్టాలని, వీలైతే సోమవారం విచారించాలని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు.
కవిత గత ఐదు నెలలుగా జైల్లో ఉన్నారన్న రోహత్గీ, సీబీఐ, ఈడీ కేసుల్లోనూ ఛార్జిషీట్లు దాఖలయ్యాయని వివరించారు. మొత్తం 493 మంది సాక్షుల విచారణ జరిగిందని తెలిపారు. ఈ కేసులో మహిళగా సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్‌కు అర్హురాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దిల్లీ సీఎం కేజ్రీవాల్, దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాకు బెయిల్ ఇస్తూ ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఈనెల 20న విచారణ చేపడతామని తెలిపింది.