Snow Games at AMB Mall in Hyderabad : ఏప్రిల్ మధ్యలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు భానుడు భగభగమంటున్నాడు. ఇంత ఎండలో అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వడం లేదు. మండుటెండల్లో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేలా స్నో కింగ్‌డమ్ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ కొండాపూర్‌లో ఉన్న ఏఎమ్‌బీ మాల్‌లో దాదాపు 14వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిశీలత వాతావరణం ఉండేలా దీన్ని నిర్మించారు.
ఏడాది పాటు స్నోకింగ్‌డమ్ తెరిచే ఉంటున్నా వేసవిలో మాత్రం ఎక్కువ గిరాకీ ఉంటోంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కిక్కిరిసిపోతోంది. సెలవు దినాల్లో మరింత సందడి ఉంటుంది. పాఠశాలల పిల్లలకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంటుంది. కేవలం ఆహ్లాదం పంచడమే కాకుండా మంచు ప్రాంతాల్లో ఉండే వాతావరణం పెరిగిన కాలుష్యం వల్ల అక్కడ ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా సందేశాత్మక వీడియోలు సైతం ప్రదర్శిస్తున్నారు. వేడి వల్ల మంచు కరగడంతో పాటు అక్కడ జీవించే జంతువులు ఎలా చనిపోతున్నాయనే అంశాలపై పాఠశాలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. అంటార్కిటికాలో ఉండే వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఇగ్లూ, స్నోమాన్, స్నోబేర్స్, షీల్స్, పెంగ్విన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో స్నో కింగ్‌డమ్ - మంచులో ఆడుకోవాలనిపిస్తే అక్కడకు వెళ్లాల్సిందే?
అందరికి అందుబాటు ధరల్లో : దేశంలో జమ్మూకశ్మీర్, షిమ్లాలో తప్పితే ఎక్కడ కూడా మంచు ప్రాంతాలు కనిపించవు. యూరప్‌తో పాటు మరికొన్ని దేశాల్లోనూ మంచు కొండలు కనిపిస్తుంటాయి. ధనికులు మాత్రమే మంచు ప్రాంతాలను చూసేందుకు కశ్మీర్ లేదా ఇతర దేశాలకు వెళ్తుంటారు. కానీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు మాత్రం అంతదూరం వెళ్లడమంటే వ్యయప్రయాసే. సామాన్యులకు సైతం ఆ అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతోనే స్నోకింగ్‌డమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
"సమ్మర్లో ఇంట్లో ఉండలేము, బయట తిరగలేము. సోషల్‌మీడియా ద్వారా హైదరాబాద్‌లో మంచు ప్రాంతం ఒకటుందని తెలుసుకుని స్నో కింగ్డమ్కి వచ్చాను. స్నో కింగ్‌డమ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సమ్మర్లో అందరూ రావాల్సిన ప్రదేశం. చాలా చల్లగా బాగుంది. కశ్మీర్ లాంటి ప్రదేశాలకు వెళ్లినట్టుగా అనిపిస్తోంది." - పర్యాటకులు
పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.650 తీసుకొని దాదాపు గంటపాటు మంచులో ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మైనస్ 8 డిగ్రీలుండే వాతావరణంలోకి వెళితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాళ్లకు ఉలెన్ సాక్సులు, మంచు నుంచి రక్షణ కల్పించే బూట్లతో పాటు స్నో జాకెట్స్, గ్లౌజులు ధరించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మంచులో ఆడుకోవడానికి స్నో స్లైడ్స్, మౌంటెన్ క్లైమింగ్, రాంపోలెంట్, స్కేటింగ్ ఏర్పాటు చేశారు. చివరి 10 నిమిషాల్లో డీజే డాన్స్‌తో ఆహ్లాదం పంచుతున్నారు.
మంచుపై సైకిల్ యాత్ర- 9వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆలయంలో పూజలు
మంచుతో ఆడుకునే సమయంలో కొన్నిసార్లు ముఖంపై కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్వో వాటర్‌తో తయారు చేసిన మంచునే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.మైనస్ 8 డిగ్రీల ప్రదేశంలోకి వెళ్లాక ఒక్కసారిగా అతిశీతల వాతావరణానికి శరీరం చల్లబడితే కాసేపు సాధారణ వాతావరణంలోకి వచ్చి మళ్లీ లోనికి వెళ్లే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వేసవితాపంలో గంటసేపు స్నోకింగ్‌డమ్ ఆహ్లాదాన్ని పంచుతోంది.
రైలే రెస్టారెంట్.. మంచులో ప్రయాణం.. ఆదాయం కోసం కొత్త ట్రిక్కులు