Students from Telugu States Topped the JEE Advanced Exam: అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. తొలి 10లో నాలుగింటిని సొంతం చేసుకున్నారు. మే 26న జరిగిన అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ మద్రాస్(IIT Madras) విడుదల చేసింది. ఇందులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 338 సాధించి 3వ ర్యాంకు, అనంతపురానికి చెందిన పుట్టి కుశాల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లా విద్యార్థి కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
కౌన్సెలింగ్‌కు 48,248 మంది: ఈసారి జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందిలో 1,80,200 మంది అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు. రిజర్వేషన్లు, కటాఫ్ మార్కుల ఆధారంగా జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు 48,248 మందికి అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. వారిలో 40,284 మంది అబ్బాయిలు, 7,964 మంది అమ్మాయిలు ఉన్నారు. గత ఏడాది మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉమ్మడిగా నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవుతుంది. మొత్తం ఐదు విడతల కౌన్సెలింగ్ ద్వారా బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి - Pawan Interested Deputy CM Post
కటాఫ్ మార్కులు పైపైకి: ఈసారి కటాఫ్ మార్కులు భారీగా పెరిగాయి. 2021లో జనరల్ కేటగిరీలో (360 మార్కులకు) 63, 2022లో 55, 2023లో 86 కటాఫ్ మార్కులుగా ఉన్నాయి. ఈసారి కటాఫ్ మార్కులు 109కి పెరిగాయి. 2017లో 366 మార్కులకు 128ని కటాఫ్‌గా నిర్ణయించారు. ఆ తర్వాత అత్యధిక కటాఫ్ ఈసారే. ప్రస్తుతం ఓబీసీలకు 98, ఈడబ్ల్యూఎస్‌కు 98, ఎస్సీ, ఎస్టీలకు 54 మార్కులను కటాఫ్‌గా నిర్దేశించారు. ఆ మార్కులు సాధించిన వారు మాత్రమే జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు పొందేందుకు పోటీపడాల్సి ఉంటుంది. తుది కీలో పేపర్-1, 2లో ఒక్కో ప్రశ్నకు జవాబులు మార్చారని, పేపర్-2లో ఒక ప్రశ్నను తొలగించి అందరికీ మార్కులు కలిపారని శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. గతంలో 285 మార్కులకు 100లోపు ర్యాంకులు వచ్చాయని, ఈసారి 300పైన మార్కులు వచ్చిన వారికే అది సాధ్యమైందని చెప్పారు.
అర్హుల్లో 7-8 వేల మంది తెలుగు విద్యార్థులు: జేఈఈ అడ్వాన్స్‌డ్ మొదటి 100 ర్యాంకర్లలో 25 మంది ఐఐటీ మద్రాస్ జోన్ విద్యార్థులు ఉన్నారు. వారిలో 20 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉండటం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. 500ల ర్యాంకులలోపు 145 మంది మద్రాస్ విద్యార్థులు ఉండగా వారిలో కనీసం 100 మంది ఏపీ, తెలంగాణ వారు ఉంటారని అంటున్నారు. మద్రాస్ జోన్‌లో కౌన్సెలింగ్‌కు అర్హత పొందిన మొత్తం 11 వేల 180 మందిలో తెలుగు రాష్ట్రాల వారు సుమారు 7 వేల నుంచి 8 వేల మంది వరకు ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఐటీల్లో ఏటా 18-20 శాతం మంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు.
బాంబే ఐఐటీలో కంప్యూటర్స్ సైన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు తగినట్టు రోజూ పది నుంచి 12 గంటలపాటు కష్టపడి చదివా. కర్నూలు జిల్లా ఆదోని మాది. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుకున్నా. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల పాఠాలతోనే మూడో ర్యాంకు సాధించగలిగా.- 3వ ర్యాంకర్ సందేశ్
పాఠశాల స్థాయిలోనే నేర్చుకున్న ఐఐటీ పరీక్షల బేసిక్స్, హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో ఇచ్చిన శిక్షణ మంచి ర్యాంకు సాధించడానికి సహకరించాయి. అనంతపురం ఆర్కేనగర్‌లో నివసిస్తున్నాం. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీటు సాధించడమే లక్ష్యంగా ఉదయం ఆరున్నర నుంచి రాత్రి పదింటి వరకు చదువుకునేవాణ్ని.- 5వ ర్యాంకర్ కుశాల్‌కుమార్
కర్నూలు గణేశ్‌నగర్‌లో నివసిస్తున్నాం. మా అమ్మానాన్నలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. కళాశాలలో అధ్యాపకులు నేర్పిన అంశాలపై బాగా చదువుకునేవాణ్ని. బాంబే ఐఐటీలో సీఎస్‌ఈ చేయాలన్నదే లక్ష్యం. సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తా.- 8వ ర్యాంకర్ తేజేశ్వర్
ఇక అమరావతికి కొత్త కళ - యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు - CRDA Started Work in Capital