Strong Arrangements for Votes Counting : ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వెలువడే ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం లేదా పామర్రు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో వెల్లడికానుందని అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రమాణాల ప్రకారం ఓట్ల లెక్కింపునకు నిర్దిష్ట సంఖ్యలో టేబుళ్లను ఏర్పాటు చేయాలి. కానీ 2019 ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సమయంలో 14 టేబుళ్లకు సరిపడా హాలుల్లేవని ఇష్టానుసారం ఏర్పాటు చేయించారు. దీంతో ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. ఈసారి మాత్రం ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్‌సభ, శాసనసభ స్థానాలకు టేబుళ్లు పక్కపక్కనే ఉంటాయి.
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల్లో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికలకంటే ఈసారి తగ్గిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితాల సమయం వెల్లడి ఉంటుంది. ఒక్కో రౌండ్‌లో 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తికావడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. తుది ఫలితం వెల్లడి కావడానికి కనీసం 7 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును 14 టేబుళ్లపై 16 రౌండ్లలో పూర్తి చేయనున్నారు. 11 మంది పోటీలో ఉండటంతో 4 గంటల్లోనే ఫలితం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. జగ్గయ్యపేట కౌంటింగ్ కూడా 16 రౌండ్లకే పూర్తవుతుంది. కాకపోతే అక్కడ 14 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందువల్ల ఫలితం రావడానికి గంట సమయం అదనంగా పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మైలవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల కౌంటింగ్ 22 రౌండ్లలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఫలితాలకు కనీసం పది గంటల సమయం పడుతుందని ఆర్వోలు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష - అధికారులకు కీలక ఆదేశాలు - ECI reviews counting arrangements
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫలితం ముందుగా తేలనుంది. అక్కడ 14 మంది అభ్యర్థులు ఉండటంతో కౌంటింగ్ 15 రౌండ్లలో పూర్తవుతుంది. ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లను తెరపై చూపించేందుకు కొంత ఎక్కువ సమయం పడుతుందని అంచనా. అయితే పామర్రు ఫలితం ముందుగా రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17 కానీ అభ్యర్థులు 8 మంది కావడంతో కౌంటింగ్ రౌండ్లను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల ఓట్లను 22 రౌండ్లలో లెక్కించనున్నారు. ఫలితం రావడానికి కనీసం 10 నుంచి 11 గంటల సమయం పడుతుందని అంచనా. గుడివాడ కౌంటింగ్ 17 రౌండ్లలో పూర్తవుతుంది. అవనిగడ్డ ఓట్ల లెక్కింపు 20 రౌండ్ల వరకు ఉండంతో కొంత ఆలస్యమవుతుంది. మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు దాదాపు ఇదే సమయం పట్టొచ్చని అంచనా. ఫలితాలు వెల్లడయ్యే వరకూ రాజకీయ నేతల్లోను, ప్రజల్లో ఉత్కంఠ కొనసాగనుంది.