State Level Bullock Cart Competitions in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా ఏడీబీ రోడ్డులోని రంగంపేట-వడిశలేరు మధ్య ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 63 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు 1,600 మీటర్లు, జూనియర్స్ వెయ్యి మీటర్ల విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. గన్ని సత్యనారాయణమూర్తి 6వ వర్ధంతిని పురస్కరించుకుని జీఎస్‌ఎల్ ఆసుపత్రి ఛైర్మన్ గన్ని భాస్కరరావు ఈ పోటీలను ఏర్పాటు చేశారు.
మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎన్.చినరాజప్ప ఈ పోటీలను ప్రారంభించారు. సీనియర్ విభాగంలో ప్రథమస్థానంలో డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి, ద్వితీయ స్థానంలో అనకాపల్లి జిల్లా కె.జి.పురం వాస్తవ్యుడు శ్రీఆంజనేయం, తృతీయ స్థానంలో కోరా శృతి చౌదరికి చెందిన ఎడ్లు నిలిచాయి.
భళా అనిపించిన ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు
విజేతలకు బహుమతులుగా ద్విచక్ర వాహనాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ అందజేశారు. జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట చెెందిన వేగుళ్ల కృష్ణమాధవి, ద్వితీయ స్థానంలో డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి, తృతీయ స్థానంలో ఛాముండేశ్వరి సీఫుడ్స్ గంగపట్నం, నెల్లూరు జిల్లా వాసి బహుమతులు గెలుచుకున్నారు.
విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గన్ని భాస్కరరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తిరుపతి జిల్లాలో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు- కొత్త అనుభూతి కలిగిందన్న యువత